25, అక్టోబర్ 2017, బుధవారం

Metro మెట్రోరైలు

Metro మెట్రోరైలు మెట్రోరైలు మొదటిదశ ప్రారంభంతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
మెట్రోరైలు ప్రారంభంతో నగర ప్రయాణ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. మొదటి దశ ప్రారంభం కానున్న నాగోల్ నుంచి మియాపూర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ప్రస్తుతం రెండు నుంచి రెండున్నర గంటలు పడుతున్నది. వర్షం పడితే ట్రాఫిక్ జామ్ సమయం అదనం. అదే మెట్రోరైలులో ఈ 30 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. నవంబర్ నెలాఖరున ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రాజెక్టు మొదటిదశ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీంతో నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రోరైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో మెట్రోరైలు అధికారులు ప్రయాణపు అంచనాలు తయారుచేశారు. ఐదు నిమిషాలకో రైలు మెట్రో ఆపరేషన్స్‌లో ఒక్కో రైలు మధ్య వ్యవధి 3-5 నిమిషాలు ఉండనున్నది. ప్రారంభంలో మియాపూర్- అమీర్‌పేట మధ్య 7 నిమిషాలకు ఒక్కటి చొప్పున ప్రతిరోజు 8 రైళ్లు నడుస్తాయి. అమీర్‌పేట-నాగోల్ మధ్య 10 నుంచి 12 నిమిషాలకు ఒకరైలు చొప్పున 10 రైళ్లను నడిపిస్తారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా వీటిని పెంచుతారు. 30 కిలోమీటర్ల మెట్రో మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉన్నాయి. రైలు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు చేరడానికి ఒకటిన్నర నుంచి రెండు నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నది. మొదట్లో ప్రయాణ సమయం గంట వరకు ఉంటుందని, కొన్నాళ్ల తర్వాత 45 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ప్రతిరోజు 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉన్నదన్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు అనుసంధానంగా.. నాగోల్-మియాపూర్ మార్గంలోని అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానం చేస్తూ మెట్రో ఆపరేషన్స్ చేపడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను నగరంలోని గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు, నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు అనుసంధానంగా ఉన్న జేబీఎస్, రైల్వే ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అనుసంధానిస్తూ సమీప మెట్రో స్టేషన్ల నుంచి బస్సులు నడుపనున్నారు. నాగోల్ - మియాపూర్ దూరం: 30 కిలోమీటర్లు స్టేషన్లు: 24 ప్రయాణ సమయం: 45-60 నిమిషాలు సామర్థ్యం: 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది ప్రస్తుతం రైళ్ల ఫ్రీక్వెన్సీ: మియాపూర్- అమీర్‌పేట: 7 నిమిషాలు, అమీర్‌పేట- నాగోల్: 10- 12 నిమిషాలు నడిపే రైళ్లు: మియాపూర్-అమీర్‌పేట మార్గంలో 8, అమీర్‌పేట- నాగోల్ మార్గంలో 10 ప్రతిరోజు ... మరే మెట్రో సాటిరాదు.. దేశంలోని మరే మెట్రోరైలు హైదరాబాద్‌కు సాటిరాదని కేటీఆర్ చెప్పారు. దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో పీపీపీలో ఇంత పెద్ద ప్రాజెక్టును ప్రపంచంలోని ఏ దేశంలో నిర్మించలేదని అన్నారు. విదేశీ నిర్మాణ సంస్థలు కాకుండా స్వదేశీ కంపెనీ ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఒలిఫెంటా వంతెన నిర్మాణం సంక్లిష్టమైనదని, ట్రాఫిక్‌ను జీహెచ్‌ఎంసీ నియంత్రించినా రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడకుండా వంతెనను బిగించిన ఎల్‌అండ్‌టీకి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ స్టీలు బ్రిడ్జి వెరీవెరీ యునిక్ అని అభివర్ణించారు. రోడ్డు మధ్యలో హైట్ చేస్తున్నా ఇబ్బందేమీ ఉండదని, పబ్లిక్ ఫ్రీ మూమెంట్ ఉండేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రతి స్టేషన్‌లో స్టెయిర్‌కేస్‌లు, ఎస్కలేటర్లు ఉన్నాయని, స్టేషన్‌కు ఆనుకుని ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలు కూడా నిర్మిస్తామని తెలిపారు. ప్రయాణికులు మెట్రోకారిడార్లకు అనుసంధానంగా ఏర్పాటు చేసే స్కైవాక్‌ల ద్వారా తమకు అవసరమైన చోటులో దిగి పోయే విధంగా ఏర్పాట్లు ఉంటాయని అన్నారు. నాగోల్-మియాపూర్ ప్రారంభమైతే 72 కిలో మీటర్ల ఈ ప్రాజెక్టులో 40 నుంచి 42 శాతం అందుబాటులోకి వచ్చినట్లేనని తెలిపారు. ప్రస్తుతం 34 పార్కింగ్ ప్రాంతాలను గుర్తించామని, జీహెచ్‌ఎంసీ తోపాటు ప్రైవేటు పార్కింగ్‌ను కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు. రైల్వే స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు స్కైవేలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌నుంచి ప్రయాణికులు స్కైవేల ద్వారా నేరుగా మెట్రోరైలు స్టేషన్‌కు చేరుకోవచ్చని కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ స్టేషన్లతో స్కైవేలను అనుసంధానం చేస్తున్నామన్నారు. మెట్రోరైలు నిర్మాణం, ఆపరేషన్‌లో స్మార్ట్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. స్టేషన్ల నుంచి కాలనీలకు చేర్చేందుకు ఎలక్ట్రికల్ వాహనాలు,15 నుంచి 20 సీట్ల సామర్ధ్యం గల మినీ వ్యాన్లను ఉపయోగిస్తామని చెప్పారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని 3,4 కిలోమీటర్లలోపు ప్రయాణికుల రాకపోకలకు వీటిని ఉపయోగిస్తామన్నారు. ఎంఎంటీఎస్, ఆర్టీసీ, మెట్రోరైలు టికెట్ల కోసం కామన్ కార్డు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఓలా, ఉబెర్ సంస్థలను కూడా దీనికిందకే తెచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎల్ అండ్‌టీ స్మార్ట్‌యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. రెండోదశపై అధ్యయనం పూర్తి ఓల్డ్ సిటీ ప్రాజెక్టు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించి స్పష్టమైన ప్రణాళికతో దాన్ని చేపడుతామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఎంపీ దీనికి సానుకూలంగా ఉన్నారన్నారు. రెండవదశ మెట్రోరైలు నిర్మాణం కోసం టోక్యో వెళ్లివచ్చామని, వివిధ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఆర్థిక పరమైన అంశాలు, అంచనా వ్యయం, భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టతకు వచ్చామని, దీనిపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దశలవారీగా ప్రారంభిస్తూ వచ్చే సంవత్సరం నవంబర్ 2018 నాటికి పూర్తి ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...