16, నవంబర్ 2017, గురువారం

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ...
SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)ఏ ద్వారా SC ST లకు ప్రమోషన్ లో రిజర్వేషన్ వచ్చాయి.కోర్టు తీర్పులఅనుసరించి సీనియారిటీ విషయం లో SC ST ఉద్యోగులకు కొంత చుక్కెదురు అయినా రిజర్వేషన్లు ప్రమోషన్ లలో పూర్తిగా సుప్రీం కోర్టు వ్యతిరేకించలేదు. సీనియారిటీ లిస్ట్ మరియు అక్కడి రోస్టర్ పరిస్థితి తదితర విషయాలు రాష్ట్రాలు చూసుకోవాలని కేంద్రం సూచించింది. ఆర్టికల్ 16(4)ఏ కూడా ప్రమోషన్ లలో రిజర్వేషన్లు పూర్తిగా రాష్ట్రాలకు అప్పజెప్పడం జరిగింది. గత కొంతకాలం గా సుప్రీం కోర్టు ఇస్తున్న తీర్పులను వక్రీకరిస్తూ దళితేతరా దేశం లోని ఉద్యోగ సంఘాలు కొంత హడావిడి చేస్తున్నాయి.కోర్టు తీర్పు లు ఒక తీరుగా ఉంటే అసలు ప్రమోషన్ లలో రిజర్వేషన్లు కోర్ట్ కొట్టేసింది అని సోషల్ మీడియా ద్వారా ప్రచారం మొదలుపెట్టారు. అలా ప్రచారం మొదలుపెట్టడమే కాకుండా తెలుగు రాష్ట్రాల CS లను కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సుప్రీం కోర్టు ,ఆ యా రాష్ట్రాల ఉద్యోగుల పదోన్నతి విషయం లో పారదర్శకత పాటించాలి,రోస్టర్ లో అక్కడ SC ST ల శాతం ఎంత ఉన్నదో చూడాలి అంటూ సూచనలు చేసింది. కానీ ప్రమోషన్ లలో రిజర్వేషన్ లను పూర్తిగా వ్యతిరేకించలేదు అని గమనించాలి. అసలు ఇవన్నీ కోర్టు తీర్పులు కాకుండా SCST లకు ఆర్టికల్ 16(4)ఏ ప్రకారం ,రాజ్యాంగ సవరణ కొరకు 117 సవరణ బిల్లు 2012 లో రాజ్యసభలో ఆమోదం అయి లోక్ సభలో ఆమోదానికి సిద్ధం గా ఉన్నది. SC,ST లకు ఈ బిల్ కనుక పాస్ అయితే ,ఈ కోర్టు తీర్పులు అంటూ సోషల్ మీడియా లో ఆధిపత్య కులాల గగ్గోలులు తగ్గినట్టే. మొన్నటిమొన్న కర్ణాటక రాష్ట్రం లో వేలాదిమంది ఆ రాష్ట్ర ప్రభుత్వ BC ,OC ఉద్యోగులు బారీ ర్యాలీ తీశారు.ఈ ర్యాలీ ఉద్దేశం ప్రమోషన్ లలో రిజర్వేషన్లు ఉండద్దు అన్నదే. రాజ్యాంగ సవరణ 117 వ బిల్ కనుక పాస్ అయితే వీళ్ళ నోళ్లు దానికవే మూతపడుతాయి అన్నది నిజం. బీహార్ ఎన్నికల్లో SC,ST ప్రమోషన్లలో రిజర్వేషన్ల బిల్లు లో కొంత కదలిక తెచ్చిన బీజేపీ సర్కారు కుట్ర పన్నింది.ఎలాగూ రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా ఉన్న బిసి మెజారిటీ సమాజం ప్రమోషన్లలో రిజర్వేషన్లకు ససేమిరా అంటుంది.ఈ విషయం తెలిసిన బీజేపీ ,బీహార్ ఎన్నికల్లో బీసీ మరియు SCST ల ఐక్యత ను దెబ్బతీసే కుట్రలు చేసింది.ఇలాంటి కుట్రలో భాగంగానే ,మండల కమిషన్ గొడవల సమయం లో" SC,ST అట్రాసిటీ చట్టం" ను చేయడం అని గమనించాలి. ఇవన్నీ తెలియని దళిత ఉద్యోగులు ,ఉద్యోగ౦ వచ్చిన తరువాత పోరాటాలు మరచి వట్టి వ్యక్తులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళు బాబాసాహెబ్ వలన దళిత సమాజానికి రెప్రెజెంటేటర్లo అనే సంగతి మరచి పోతున్నారు. ముందుగా ప్రమోషన్ లలో రిజర్వేషన్ల ను మనం ఉద్యోగులుగా సాదించుకుంటే భావి తరాలకు బాసట గా నిలుస్తాయి.తద్వారా మంచి స్థానం లో దళితులు ఉంటే సమాజానికి కూడా మేలు చేసినవారు అవుతారు గమనించండి. మాకు ఇది చాలు అనుకోవడానికి మీకు బాబా సాహెబ్ రిజర్వేషన్లు కల్పించలేదు. దళిత సమాజానికి మీరు మీ వంతుగా మేలు చేస్తారు అని రిజర్వేషన్లు కల్పించారు అని మరవద్దు . కర్ణాటక లో ఆధిపత్య కుల ఉద్యోగులకు ఉన్నO త తెలివి మీకు లేకపోవడాన్ని నేను విమర్శిస్తూ.... 117వ రాజ్యాంగ సవరణ బిల్ లోకసభలో ప్రవేశపెట్టాలి,ఆమోదం అయ్యేలా చూడాలని బీజేపీ సర్కారుని డిమాండ్ చేస్తూ..

TRS టి.ఆర్.ఎస్

టి.ఆర్.ఎస్ ప్రభుత్వము చేస్తున్న అప్పు తెలంగాణ ప్రజలకు ముప్పు మంగళ వారం తేది 14-11-2017 న అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాల సమయములో ఆర్థిక శాఖమాత్యులు ఇచ్చిన వివరణ ప్రకారముగా తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు ₹ 69,479-48 కోట్లు . రాష్ట్ర ము ఏర్పడ్డాక అదనముగా ₹ 66,074-55 కోట్లు. అప్పు చేయడము జరిగింది. ఇప్పుడు మొత్తం అప్పు ₹ 1,35,554-03 కోట్ల అప్పు అయింది. ఈ అప్పుకు 2016-2017 ఆర్థిక సంవత్సరముకుగాను ₹ 8,609-19 కోట్ల వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ఈ అప్పు తెలంగాణ ప్రజలకు తలసరిగా 40 వేలు పడుతుంది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ₹ 1,66,000 కోట్ల అప్పు. అందులో ₹ 18వేల కోట్ల అప్పు మీద వివాదము ఉన్నది. మిగిలిన ₹ 1,48,060 కోట్ల అప్పును రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేసిన అప్పును " సమాచార హక్కు చట్టం 2005 ప్రకారముగా ఔత్సహికుడు తీసుకున్న సమాచారమును 2016 నవంబరు లో ఇంగ్లీష్ పత్రికలో వెలువరించిన వివరాల ప్రకారముగా 2014 నవంబరు నుండి 2016 జూన్ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ₹ 33,033 కోట్ల అప్పు చేసింది. (01) విదేశాల నుండి తీసుకున్న అప్పులకు షరతులు తెలియవు. (02) ₹1423 కోట్ల అప్పుకు 5 శాతము నుండి 6.7 శాతము వడ్డీ , నాబార్డ్ నుండి తీసుకున్న ₹ 1600 కోట్ల అప్పుకు 7.5 శాతము వడ్డీ, బహిరంగ మార్కెట్ నుండి తీసుకున్న అప్పు ₹ 28,048 కోట్ల అప్పుకు 7.39 శాతము వడ్డీ, చిన్న మొత్తాల పొదుపు సంస్థ నుండి తీసుకున్న అప్పు ₹ 1845 కోట్ల అప్పుకు 9.5 శాతము వడ్డీ, హడ్కో నుండి తీసుకున్న ₹ 1125 కోట్ల అప్పుకు 10.45 శాతము వడ్డీ, NCDC నుండి తీసుకున్న ₹ 114 అప్పుకు 11.85 శాతము నుండి 12.10 శాతము వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్పుల ఊబిలో కూరుకపోయే ప్రమాదమున్నదని " కాగ్ "/భారత కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ " తన నివేదికలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న అప్పులో సగానికి పైగా వచ్చే ఏడేండ్లలో తిరిగి చెల్లించవలసి ఉంటుందని తెలుస్తుంది. ఆ అప్పును చెల్లించడానికి మరల అప్పు చేయవలసిన పరిస్థితి పొంచి ఉన్నది. అలాగే చేసిన అప్పులకు వడ్డీలను చెల్లించడానికి కూడా అప్పులు చేయవలసిన పరిస్థితి పొంచి ఉన్నదని అభిశంచింది. మన భారత స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తితో అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని కొనసాగించి " తెలంగాణను సాధించుకోవడము జరిగింది. ఇప్పుడు టి.ఆర్.ఎస్ ప్రభుత్వము చేస్తున్న అప్పును నిలువరించడానికి సమయాత్తము కావలసిన అవసరమున్నది.

15, నవంబర్ 2017, బుధవారం

Shanthi Swaroop శాంతి స్వరూప్

శాంతి స్వరూప్ వికీపీడియా లో నేను రాశాను Shanthi Swaroop శాంతి స్వరూప్
మాతృభాషలో పేరు శాంతి స్వరూప్ నివాసం హైదరాబాద్: హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం జాతీయత భారతీయుడు చదువు పట్టభద్రుడు వృత్తి యాంకర్ , దూరదర్శన్ (టి.వి) లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి . మతం హిందూ జీవిత భాగస్వామి సహ యాంకర్ రోజా రాణి పిల్లలు ఇద్దరు కుమారులు పురస్కారాలు తెలంగాణ రాష్ట్రం శాంతి స్వరూప్ ప్రభుత్వ ప్రచార సాధనమైన దూరదర్శన్ లో తొలి తెలుగు యాంకర్ మరియు అదే దూరదర్శన్ (టి.వి) లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి . బాల్యం, కుటుంబం హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ గారు చిన్ననాటనే తండ్రి, ఆ తర్వాత... పెంచి పెద్దచేసిన అన్నయ్య కాలం చేయడంతో కుటుంబ భారం మోసారాయన. శ్రద్ధాశక్తులతో వార్తలు చదివిన ఆయన 1980 లో సహ సీనియర్ యాంకర్ రోజా రాణి ని జీవిత భాగస్వామి గా చేసుకున్నారు. ఆమె కూడా ఈ మధ్యనే కాలం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు. వారిద్దరూ ఐ ఐ టీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు. జీవిత విశెషాలు నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు.. బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు ప్రారంభించారు… తెలుగు టీవీ చరిత్రలో తొలిసారి ప్రసారమైన వార్తల్లోని ముఖ్యాంశాలు ఇవి. దూరదర్శన్ చానల్ లో సాయంత్రం 7 గంటలకు 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన ఈ వార్తలు బులిటెన్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఒక సంచలనం. వాటిని లైవ్ లో చదివి వినిపించింది, ఇప్పుడు చాలా మంది న్యూస్ రీడర్లు గురువుగా భావించే శాంతి స్వరూప్. జీవన, సాహిత్య సారాన్ని అవపోసనపట్టి యాంకర్ బాధ్యతను సమర్ధంగా నిర్వహించారు. 2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు. వృత్తి ఆయన వృత్తి రీత్యా 1977 అక్టోబర్ 23 లోనే లాంఛనప్రాయంగా హైదరాబాద్ వచ్చిన డీ డీ ఎదుగుదలను దగ్గరి నుంచి చూసిన శాంతి స్వరూప్ తెలియని నాటి తరం తెలుగువాళ్ళు బహుశా ఉండరేమో! వార్తలు చదవడం కోసం ఆయన 1978 లో ఉద్యోగం లో చేరినా ఆయన వార్తలు చదవడానికి 1983 దాకా వేచి చూడాల్సి వచ్చింది.మూడు దశాబ్దాల క్రితం కనీసం టెలీ ప్రాంప్టర్ కూడా లేదు. దీంతో స్క్రిప్ట్ పేపర్లనే బట్టీ పట్టి వార్తలు చెప్పారు శాంతి స్వరూప్. వార్తలు ప్రారంభమైన పదేళ్ల పాటు అదే పరిస్థితి. టెలీ ప్రాంప్టర్ లేదు.. తప్పులు జరగకుండా చాలా బట్టీ పట్టి వార్తలు చదివే వాడిని.. మిగిలిన వారు అందరూ భయపడ్డారు ఎక్కడ తప్పులు చదువుతానోనని” అంటూ ఆనాటి జ్ఞాపకాలని ఆయన అంటారు . మంచి వక్త తెలుగు లో మొట్ట మొదటి యాంకర్ అయిన శాంతి స్వరూప్ ఈ మధ్యన పలు టీవీ ఛానళ్లలో దర్శనం ఇస్తున్నారు [3]. ఎంతో ఉత్సాహంగా ఆయన పలు విషయాలు చెబుతారు.​ "వార్తలు చదవకండి. వార్తలు చెప్పండి....,"అని శాంతి స్వరూప్ గారు పిల్ల యాంకర్లకు సలహా చెబుతారు. 24 గంటలూ ఇచ్చే వార్తలు లేవని, అయినా వండి వార్చడం ఘోరంగా తయారయ్యిందని అని ఆయన అంటారు.

30, అక్టోబర్ 2017, సోమవారం

Fish చేపల చెరువు

రాజావారి చేపల చెరువు :P Only for academic discussion…
నేను అభివృద్ధికి, భారీ ప్రాజెక్టులకు గుడ్డి వ్యతిరేకిని కాదు. సామాజిక, పర్యావరణ పర్యవసానాలపై సరైన అధ్యయనం వుండాలని కోరుకునే వాడిని మాత్రమే. ఆయా పార్టీలకు, ఆయా ప్రభుత్వాలకు, ఆయా నాయకులకు దీనిని ముడిపెట్టి.. రాజకీయ పోస్టుగా మార్చకండి.... హైదరాబాద్ శివార్లలో నాకు బాగా నచ్చే చెరువుల్లో ఒకటి.. నాగార్జునసాగర్ రోడ్డులోని ఇబ్రహీంపట్నం చెరువు. సింగిల్ రోడ్డు వున్నప్పుడు, ఆ కట్టమీదుగా ప్రయాణం చేస్తుంటే భయపడేవాడిని. పొరపాటున అందులో పడిపోతే మన గతేంటని భయమేసేది. అంత పెద్ద చెరువు. అది ఎండిపోవడాన్ని ఏనాడూ చూడలేదు. కానీ.. 35సంవత్సరాల తర్వాత ఎండిపోయింది. ఎన్నో కరువులు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు వచ్చినా మూడున్నర దశాబ్దాల కాలంలో ఈ చెరువు ఎండలేదు. కానీ.. ఎండిపోయింది. గూగుల్ ఎర్త్ ద్వారా సంబంధిత ఫోటోల ద్వారా ఈ విషయాన్ని వివరించడానికి, నా సందేహాలు వెలిబుచ్చడానికి ప్రయత్నిస్తాను. 2003లో చెరువు ఫుల్లుగానే వుంది. 2004నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వానలు బ్రహ్మాండంగా కురిశాయి. కానీ.. తర్వాత కాలంలో చెరువు ఎండిపోవడం మొదలైంది. 2008నాటికి నీటిచుక్క లేకుండా పోయింది. హైదరాబాద్ లో అనేక ప్రాంతాలలో చెరువులు కబ్జాకు గురయ్యాయి. నీటి పారుదల మార్గాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. అయినా ఆయా చెరువుల్లో అంతో ఇంతో నీళ్లు కనిపిస్తాయి. కానీ, ఇబ్రహీంపట్నం చెరువేవీ ఆక్రమణలకు గురవలేదు. హటాత్తుగా ఎండిపోయింది. 2014లో మాత్రమే.. కొద్దిపాటి నీళ్లు చేరాయి. ఔటర్ రింగ్ రోడ్డు(ORR) నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత ఇబ్రహీంపట్నం చెరువు ఎండిపోవడాన్ని గమనించవచ్చు. ఒక్క ఇబ్రహీంపట్నం చెరువేకాదు, రావిర్యాల చెరువు, ఈ పరిసర ప్రాంతాల్లోని ఇంకా అనేక పెద్ద చెరువులు ఎండిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలోనే శంషాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు పొడవునా.. అన్ని ప్రాంతాల్లోనూ చెరువుల పరిస్థితి ఇలాగే అయిందా లేదా అనే విషయం నాకు తెలియదు. నేను గమనించిన విషయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాను. ఏదో నేటి తరాల అవసరాన్ని, ఇప్పటి రద్దీని మాత్రమే దృష్టిలో వుంచుకోకుండా, భావితరాల అవసరాలను దృష్టిలో వుంచుకుని విశాలమైన రహదారులు, విమానాశ్రయాలు, ప్రయాణ సదుపాయాలు వుండడం చాలా అవసరం. నేను ఆ ప్రాజెక్టులను పూర్తిగా సమర్ధిస్తాను. నా పాయింటు ఏమిటంటే.. ఈ ప్రాజెక్టుల కారణంగా జలవనరులు అంతరించాయా లేదా అనేదానిపై శాస్త్రీయ అధ్యయనం సాగాలని. శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత, విమానం కనుచూపు మేరలో ఎగురుతుండగా చూడగలిగే ప్రాంతాలలో వానలు కురవడం కూడా తగ్గాయని చాలా మంది నాతో అన్నారు. ఉదాహరణకు షాద్ నగర్ ప్రాంతం. వారి అభిప్రాయంలో శాస్త్రీయత వుందని నేను అనుకోవడం లేదు. ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం తర్వాత సమీప ప్రాంతాల్లో వర్షపాతంలో వచ్చిన మార్పులతో బేరీజు వేసుకుంటే కానీ దీనిపై ఒక నిర్ణయానికి రాలేము. కానీ.. ఇబ్రహీంపట్నం చెరువు ఎండిపోవడానికి మాత్రం ప్రధాన కారణం ఔటర్ రింగ్ రోడ్డు అయివుంటుందని నా అనుమానం. ఈ చెరువుకి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోని ఔటర్ రింగ్ రోడ్డు బొంగుళూరు జంక్షన్ చిత్రాలను, అలాగే 2004నాటి శంషాబాద్ చిత్రాలను జతపరుస్తున్నాను. ప్రతి చిత్రానికి ఆయా సంవత్సరం వివరాలు కూడా జోడిస్తున్నాను. కేవలం అకడమిక్ డిస్కషన్ కోసం నా అనుమానాలనే కాదు.. అనేకమంది అనుమానాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఎవరినైనా ప్రోత్సహిస్తుందని ఈ పోస్టు.

28, అక్టోబర్ 2017, శనివారం

Land భూమి

భూమికి సంబంధించిన రికార్డుల్లో ని పదాల్లో కొన్ని మొఘల్‌ చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉన్నవి కాగా... ఎక్కువ మాత్రం నైజాం కాలం నాటివి.
మన రాష్ట్రం లో భూ రికార్డుల ప్రక్షాళన నేటి నుండి ప్రారంభం అయిన నేపథ్యంలో రెవెన్యూ రికార్డుల్లో ఉండే పదాలు వాటి అర్థాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ రోజు మొదటిభాగం లో కొన్ని పదాలకు అర్థం తెలుసుకుందాం... 1.అడంగల్‌/పహాణీ.. గ్రామంలోసాగు భూమి వివరాలను నమోదు చేసే రిజిస్టర్‌. దీనిని ఆంధ్రా ప్రాంతంలో అడంగల్, తెలంగాణ ప్రాంతంలో పహాణీ అని పిలుస్తారు. ఈ రిజిస్టర్‌నే గ్రామ లెక్కల నంబర్‌–3 రిజిస్టర్‌ అని కూడా అంటారు. ఈ రిజిస్టర్‌లో గ్రామంలోని అన్ని భూముల వివరాలు ప్రతి సంవత్సరం నమోదుచేస్తారు. 2.పట్టాదారుపాసుపుస్తకాలు: భూమి యాజమాన్యపు హక్కు పత్రాలు. గ్రామంలో ఎవరెవరికి ఎంతెంత భూమి ఉంది. ఏ సర్వే నంబర్‌లో ఉంది. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనే వివరాలతో పట్టాదారుల ఫోటోలు అతికించి 1-బి రిజిస్టర్ను తయారు చేసి దానిని బట్టి తహసీల్దారు పట్టాదారు పాసు పుస్తకాలు జారీచేస్తారు. ఈ 1-బి రిజిస్టర్ ను పూర్వం 10 (1) ఖాతాల రిజిస్టర్ అనేవారు. 3.పంచరాయి.. గ్రామంలో పశువుల మేతకోసం కేటాయించబడిన ప్రబుత్వ భూమిని పంచరాయి అంటారు. గ్రామానికి దూరంగా అందరి పశువులకు మేతకోసం ఉపయోగించుకుంటారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి దీనిపై ఎవరికీ అధికారాలు ఉండవు. 4.బందోబస్తు.. : వ్యవసాయ భూముల సర్వే, వర్గీ కరణ. 4a)బంజరు భూమి : ఖాళీగా, వ్యర్థంగా ఉన్న ప్రభుత్వ భూమి. 4b)బీఘా.. : బీఘా అంటే 30గుంటల భూమి. 36.30 చదరపు గజాలతో సమానం.. 4c)బిల్‌ మక్తా.. : సాధారణ శిస్తుకంటే తక్కువ శిస్తు నిర్ణయించిన భూమి లేదా గ్రామాన్ని బిల్‌ మక్తా అంటారు. 5.చలానా.. ఇర్సాలు నామా అంటే గ్రామం లెక్క నంబర్‌–7. దీనినే చలానా అంటారు. దీనిద్వారా ప్రభుత్వానికి చెల్లించిన భూమి శిస్తు, వగైరాలను వసూలు చేసి నిర్ణీత తేదీల్లో ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. 6.ఎండార్స్‌మెంట్‌ : గ్రామంలో ప్రజలు....ప్రభుత్వ అధికారులకు ఏదైనా దరఖాస్తు చేసుకుంటే దానిపై నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తెలియ చేసేవిధానం. 7.ఇజారా : ప్రభుత్వానికి చెందిన భంజరు భూములను వ్యవసాయానికి కానీ, నివాసం ఉండటానికానీ కొంత నిర్థిష్టమైన పన్ను చెల్లించే పద్ధతిపై లీజుకు ఇవ్వడాన్ని ‘ఇజారా’అంటారు. 8.ఫసలీ : ప్రతి సంవత్సరం జులై,1 తరువాత నుంచి తరవాత సంవత్సరం జూన్‌30 వరకు ఉన్న 12నెల్ల కాలాన్ని ‘ఫసలీ’ అంటారు. ఈ పదం మొఘల్ కాలం నుంచి వాడుకలో ఉంది. 9.ఎఫ్‌ఎంబీ టిప్పన్‌ : ఇది గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఒకటి. గ్రా మంలోని అన్ని సర్వే నెంబర్ల పటాలు ఇందులో ఉంటాయి. వాటి కొలతలు కూడా ఉంటాయి. 10.చల్కా.. మట్టిలో ఎక్కువ భాగం ఇసుకతో కూడుకున్నది. సాధారణంగా ఈ భూముల్లో నీరు తక్కువగా అవసరం ఉండే పంటలు పండిస్తుంటారు. 10a).ఖుష్కి : వర్షాధారపు భూమిని ఖుష్కి అంటారు. దీనినే మెట్టభూమి అనికూడా అంటారు. 10b).తరి : నీటి సౌకర్యం గల భూమిని తరి అంటారు. దీనినే మాగాణి అంటారు.

25, అక్టోబర్ 2017, బుధవారం

Their history ఎరుకల వారి చరిత్ర

Their history ఎరుకల వారి చరిత్ర
ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు రాజుదే తొట్టతొలి తెలుగు (కలమళ్ళ) శాసనం. ఇది క్రీ.శ.575వ సంవత్సరం నాటిది. పూర్వ బ్రాహ్మీ లిపి (క్రీ.పూ.3వ శతాబ్దం కంటే ముందు) కాలం నుంచే తెలుగుదేశంలో కనిపిస్తున్న గుహచిత్రాల్లో (కేవ్ పెయింటింగ్స్‌లో) తెలుగు లిపి మూలాలున్నాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేస్తే తెలుగు లిపి/ భాష మూలాలతో పాటు ఎరుకల లిపి/ భాష మూలాలు కూడా వెలికి వచ్చే అవకాశం మొండుగా ఉంది. ప్రాచీన సాహిత్యం, శాసనాలు సమకూర్చే సమాచారా న్ని ఎరుకల ప్రజలు పాటిస్తున్న ఆచార సంప్రదాయాల్లోని ప్రాచీనతతో పోల్చి సమన్వయం చూస్తే వీరిది భారతదేశంలో ఒక అనాది తెగ అని స్పష్టంగా అర్థమవుతుంది. మహా భారతం ఇతిహాసంలో కనిపించే ఏకలవ్యున్ని ఎరుకలు తమ కులాధిపతిగా చెప్పుకుంటున్నారు. కానీ హరివంశం పురా ణం (34, 93-99 అధ్యాయాలు) ప్రకారం ఏకలవ్యుడు గిరిజనుడు కాదు, క్షత్రియుడు. మధ్య భారతదేశంలోని కేకయ రాష్ర్టాన్ని పాలించే రాజుకు-అతని రెండవ భార్య శృతదేవకు పుట్టినవాడు. శృతదేవ శ్రీకృష్ణుడికి మేనత్త. కాబట్టి ఏకలవ్యుడు కృష్ణుడికి బావమరిది. కృష్ణుడి మేనమామ కంసుడి మామ జరాసంధునికి సర్వసైన్యాధిపతిగా ఏకలవ్యుడు పనిచేశాడు. కృష్ణుడు కంసున్ని చంపినందుకు ప్రతీకారంగా జరాసంధుడు కృష్ణ-బలరాములచే రక్షించబడి, మధురా పట్టణంపైన 18 సార్లు దాడి చేశాడు. ఆ దాడుల్లో భాగంగా ఏకలవ్యుడు బలరామునితో భీకరమైన ధనుర్యుద్ధాలు, గదాయుద్ధాలు చేశాడు. కానీ కృష్ణుడు చివరికి ఏకలవ్యున్ని చంపాడు. పై చరిత్రలో ఏకలవ్యుడు క్షత్రియుడు ఏకలవ్యున్ని (తమ గిరిజన) మూల పురుషునిగా ఎందుకు భావిస్తారు అనే ప్రశ్నకు రెండు సమాధానాలున్నాయి. ఒకటి, కేకయరాజు (ఏకలవ్యుడి తండ్రి) తాత బ్రహ్మణ స్త్రీని పెండ్లి చేసుకున్నందున క్షత్రియుల్లో తక్కువ జాతి అయిన సూత జాతికి (రథకారులు) చెందినవారుగా కేకయ వంశీయులు గుర్తించబడ్డా రు. రెండు, కేకయ రాజ్యంలో గిరిజనులే ఎక్కువమంది నివసించడం, అలాంటి గిరిజనులైన భిల్లులు, ఎరుకలు ఏకలవ్యున్ని తమ మూల పురుషుడిగా చెప్పుకోనారంభించారు. ఆయన జనరంజక పాలనకు గుర్తుగా ఇక ఇప్పటివరకు లభిస్తున్న ఆధారాలు ఏకలవ్యుడు భిల్లులకే ఎక్కువ దగ్గరివాడని సూచిస్తున్నాయి. అంటే బంగారు బాణం కలవాడు అని అర్థం. అతని పెద్ద కొడుకు పేరు బాణుడు. కీచకుడు అనే మరో పేరు గల ఇతడు ఏకలవ్యుని అన్న. భిల్లులు అనే పదం విల్లులు అనే పద భవం. అంటే బాణాలు ధరించేవారనేగా! కాబట్టి ఏకలవ్యుని తండ్రి, అన్నల వారసులుగా ధనుర్విద్యా విశారధుడైన ఏకలవ్యుని వారసులుగా కూడా చెప్పవ చ్చు. రెండవ కారణమమేమంటే, భిల్లులు ఇప్పటికే ఏకలవ్యుని దేశమైన కేకయ ప్రాంతం (మధ్యప్రదేశ్)లోనే ఎక్కువగా నివసిస్తున్నారు. ఆ కాలం లో ఎరుకలు కూడా ఆ ప్రాంతంలో నివసించేవారేమో! అందుకే ఏకలవ్యున్ని తమ మూల పురుషునిగా చెప్పుకుంటున్నారేమో! ఇంకా ఆధారా లు వెతుకాలి. ఎరుకల స్త్రీలు తాము చెప్పే సోదే (భవిష్యత్ దర్శనం)కు శక్తినిచ్చేది గా రేణుకా ఎల్లమ్మను ప్రధానంగా తలుస్తారు. రేణుకా ఎల్లమ్మ కొడుకు పరశురాముడు పడమటి సముద్రాన్నుంచి భూమిని, రాజ్యాన్ని ఏర్పరిచి సుసంపన్నం చేశాడని ప్రాచీన భారత సాహిత్యం విశదం చేస్తుంది. అతని వారసులైన భృగువులు విజ్ఞానాన్ని.. ప్రత్యేకించి అధర్వణ వేదాన్ని సంకలనం చేశారని అల్లాడి పద్మనాభయ్య రాశారు. (ఏన్సియెంట్ భృగుస్ అనే గ్రంథంలో) అధర్వణ వేదంలో కనిపించే మూలికా వైద్య విధానాలు ఎరుకలలో కన్పిస్తాయి. కాబట్టి ఎరుకల వారిని ఎల్లమ్మ-పరశురాముల వారసులా అనే విషయాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది. ఎరుకలవారు ఎక్కువగా కృష్ణానదీ తీర ప్రాంతాల్లో కనిపిస్తారు. కృష్ణానదిని వీరు ఏరు అంటారు. ప్రాచీనకాలంలో ఏరువనాడు అనే ఒక ప్రాంతం ఉండేది. దాని పరిపాలనా కేంద్రం ఏలేశ్వరం నల్గొండ జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఏటి ఒడ్డున ఆ పట్టణం ఉంది కాబట్టి దాని మొదటిపేరు ఏఱేశ్వరం అయి ఉంటుంది, క్రమంగా ఏలేశ్వరం అయి ఉంటుందని పలువురు స్థానిక సాహిత్య-చరిత్రకారులు భావించారు. కృష్ణా నది తీరప్రాంతంలోనే నల్లమల అడవుల్లో ఉన్న సరేశ్వరం శాసనాలు, సాహి త్య గ్రంథాల ప్రస్తావనలకు భిన్నంగా జన నానుడిలో సలేశ్వరంకావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపవచ్చు. క్రీ.శ.5వ శతాబ్దం ప్రాంతంలో ఏరువనాడులో కొంత అధికారం నెరపినవారు కనీసం మూడు దిక్కులకు వలసలు పోయి రాజ్యాలు స్థాపించినట్లు శాసనాలు, స్థల చరిత్రలు సూచిస్తున్నాయి. అలాంటివారిలో మొదటిశాఖ కర్ణాటకలోని బాదామి కేంద్రంగా క్రీ.శ. 540-750 మధ్య దక్కను రాష్ర్టాలను పాలించారు. రెండవ శాఖ కర్నూలు-కడప మండలం లో క్రీ.శ.6వ శతాబ్దంలో రేనాటి చోళులుగా స్థిరపడ్డారు. మూడవ శాఖకు చెందిన అనుమడు, కొండడు రాజ్యాన్ని స్థాపించారని తెలుస్తుంది. అలంపూరు-సంగమేశ్వరం దగ్గరి తుంబెయనూరులో లభించిన 1400ల ఏండ్ల కిందటి రెండో పులకేశి (చాళుక్య రాజు) రాగి శాసనం చాళుక్యుల జన్మస్థానం (విషయం) ఇదేనని సూచిస్తున్నది. ఈ రాజుల అధికార చిహ్నం వరాహం (పంది) అది వారి శిల్పాలు, నాణేలపై కనిపిస్తుంది. పైసలను కూడా వరహం అనేవారు. వరాహ విషయం కూడా తెలుగు దేశంలోనే ఉండేది.వరాహాలను (పందులను) పెంచడం ఎరుకల ముఖ్య వృత్తి. తొలుత చాళుక్యుల సామంతులై తదనంతరం స్వతంత్రులైన కాకతీయులు కూడా వరాహ లాంఛనులే. ఎరుకల నాంచారి గుళ్లు వారి కాలంలో పేరొందా యి. ఈ చారిత్రక విషయాలను నిగ్గుతేలిస్తే ఎరుకల పూర్వ చరిత్ర విశదమవుతుంది. ఇప్పటివరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు రాజుదే తొట్టతొలి తెలుగు (కలమళ్ళ) శాసనం. ఇది క్రీ.శ.575వ సంవత్సరం నాటిది. పూర్వ బ్రాహ్మీ లిపి (క్రీ.పూ.3వ శతాబ్దం కంటే ముందు) కాలం నుంచే తెలుగుదేశంలో కనిపిస్తున్న గుహచిత్రాల్లో (కేవ్ పెయింటింగ్స్‌లో) తెలుగు లిపి మూలాలున్నాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేస్తే తెలుగు లిపి/ భాష మూలాలతో పాటు ఎరుకల లిపి/ భాష మూలాలు కూడా వెలికి వచ్చే అవకాశం మొండుగా ఉంది.తెలుగు అంటే తెలియు అనే అర్థం కూడా మూల ద్రావిడ భాషా పదా ల్లో కనిపిస్తుంది. కాబట్టి తెలిపేవారు అనే అర్థం కలిగిన ఎరుకలవారి భాషలో కచ్చితంగా తెలుగు భాషా మూలాలు ఉంటాయి. నిజ నిర్ధారణ కోసం చేయవలసింది అధ్యయనం.

Godavari గోదావరి

Godavari గోదావరి
గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నీటి విడుదలపై స్పష్టత యాసంగికి సాగునీరివ్వాలని సీఎం నిర్ణయం నీటిని పొదుపుగా వాడుకోవాలి.. వచ్చే ఏడాదికి కాళేశ్వరం నీళ్లు సిద్ధం ఆలోగా కాల్వల నిర్మాణం పూర్తికావాలి.. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి వివాదాలకు తావు ఇవ్వొద్దు.. ఎల్లంపల్లి నుంచి మరో ఎత్తిపోతల.. రామగుండంలో 20వేల ఎకరాలకు నీళ్లు ఎస్సారెస్పీ నీటి విడుదల భేటీలో అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గోదావరి ఆయకట్టులో రెండోపంటకు నీళ్లివ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయర్ మానేరుడ్యాం, సింగూరు, ఘనపూర్ ఆనికట్, గుత్ప, అలీసాగర్, లక్ష్మీ కాల్వల ద్వారా రెండోపంటకు సాగునీరు అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ ద్వారా నీటి విడుదల, వినియోగానికి సంబంధించి పాత కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథకు కావాల్సిన నీటి అవసరాలుపోను మిగిలిన నీటిని పంటపొలాలకు మళ్లించాలని సీఎం సూచించారు. ఈ నీటితో రెండోపంట పండించుకోవాలని, ఎక్కడా వివాదాలకు తావులేకుండా ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొలాలకు తరలించుకోవాలన్నారు. నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని సీఎం సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నిరకాల చెరువులను గోదావరి నీటితో నింపుకొనే విధంగా కాల్వలు సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి కాళేశ్వరం నీళ్లు అందుబాటులోకి వస్తున్నందున ఈలోపుగానే కాల్వల పనులు పూర్తికావాలని, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నీటిపారుదల రంగానికి కావాల్సినన్ని నిధులు సమకూర్చడంతోపాటు తెలంగాణకున్న నీటి వాటా మొత్తం వాడుకొనేలా భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున.. ఎంత వీలైతే అంతవరకు పంటలకు సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని పొలాలదాకా నీరు పారించి, పంటలు పండించడంపై శ్రద్ధ చూపించాలని చెప్పారు. ఇందుకోసం అధికారుల వెంటపడి అవసరమైన పనులు చేయించుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న పాత కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందే విధంగా ఏర్పాటు జరుగాలని సీఎం స్పష్టం చేశారు. ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల.. రామగుండం ప్రాంతంలో 20వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల పథకం నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధర్మారం మండలం పత్తిపాకలో రిజర్వాయర్ నిర్మించి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు సాగునీరు అందించాలన్నారు. ఈ రెండింటికి అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. ఎస్సారెస్పీ సామర్థ్యం పెంచాలని, అన్నిరకాల కాల్వల మరమ్మతులు చేయాలని చెప్పారు. ఎస్సారెస్పీలో తొలి, చివరి ఆయకట్టు అనే తేడాలేకుండా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేలా ప్రణాళికను అమలుచేయాలని సూచించారు. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బరాజ్ నిర్మిస్తున్నం. అక్కడ సగటున 1700టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని సీఎం అన్నారు. ఈ నీటిని వాడుకోవడానికి అవసరమైన బరాజ్‌లు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. గోదావరి, కృష్ణా నదీబేసిన్లలో చెరువుల ద్వారా 265 టీఎంసీల నీటి వాటా ఉన్నదని 1974లో బచావత్ ట్రిబ్యునల్ తేల్చిందని, కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు ధ్వంసం కావడం వల్ల అంత మొత్తంలో నీటిని వాడుకోలేకపోయామని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల చెరువుల్లో నీటి లభ్యత ఉంటుందని, ఇందుకుగాను అన్ని చెరువులు నింపుకొనేలా కార్యాచరణ అమలుపరుచాలని సీఎం సూచించారు.

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...