21, అక్టోబర్ 2017, శనివారం

Mango మాంగో

Mango మాంగో మ్యూజింగ్స్
నిరుడు ఎండల కాలంలో మా దగ్గరి మిత్రుని నాన్న మెదడు సంబంధిత అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అవి మంచి మామిడిపండ్లు దొరికే రోజులు కావటంతో బాటు ఆయనకు మధుమేహం వంటి ఇతర ఇబ్బందులు లేకపోవటంతో ఆసుపత్రిలో తాను అన్నం వద్దన్నప్పుడల్లా నూజివీడు చిన్న రసాలు మొదలు బంగినపల్లి వరకు పలు రకాల మామిడి పండ్లు తినిపించేవాళ్ళం. డిశ్చార్జ్ అయిన తర్వాతా ఈ అలవాటు కొనసాగింది. కొన్నాళ్ళకు నేరుగా పండ్లు తినటం తగ్గించారు. దీంతో పెరుగన్నంలో మామిడిగుజ్జు కలిపి పెడుతూ వచ్చాం. మన అలవాట్లు, అవసరాలతో ఋతువులకు నిమిత్తం ఉండదుగా.. చూస్తుండగానే తొలకరి వచ్చింది. వానలు కురిశాక పురుగు కారణంగా మామిడి పండ్లు తినరు. కొనేవారు ఉండరు గనుక అమ్మకానికి కూడా పెట్టటం తక్కువే. అయినా మొజంజాహి మార్కెట్, కోఠీ, చేవెళ్ల వంటి చోట దొరికిన వాటితో ఆగస్టు వరకూ నెట్టుకొచ్చాం. కనిగిరి దగ్గర సాగు చేస్తున్న మా అన్నయ్య ఒకాయనకు సంగతి తెలిసి అక్కడినుంచి చిన్నకాయాలు 50 తెస్తే సెప్టెంబర్ కూడా గడిచింది. ఇక ఇక్కడ దొరక్క వేరే రాష్ట్రాల్లో ఎక్కడన్నా దొరకొచ్చని తెలిసిన వారి ద్వారా ఆరాం తీసాం. మహారాష్ట్ర అహ్మద్ నగర్ ప్రాంతంలో వినాయక చవితి వరకు చిన్న సైజు కాయలుంటాయని తెలిసి ఫోన్ (టైమ్స్ అఫ్ ఇండియా వారి పాత కథనం లో ఇచ్చిన నంబరు) చేసాం. ఉన్నవన్నీ కోసినా 7-8 కిలోలు కావచ్చనీ, అవీ కాస్త పుల్లగా ఉంటాయనీ, కావాలంటే నేరుగా వచ్చి తీసుకెళ్లమని ఆ పెద్దాయన చెప్పుకొచ్చారు. పోస్టులో పంపగలరా అని అడిగితే తనకు వయసైపోయిందనీ, కదలలేననీ అన్నారు. అంత దూరం వెళ్లాలా వద్దా? తీరా వెళ్ళాక లేకపోతే? అనుకొంటుండగానే ముంబై లో ఉండే మా బావ ఫోన్ చేస్తే ఈ సంగతి చెప్పుకొచ్చా. ఆయన అక్కడ ఊరిమీదబడి తిరగ్గా తిరగ్గా అతికష్టం మీద 10 పెద్ద పండ్లు దొరికాయి. దసరాకి వస్తూ తెచ్చిన ఆ పండ్లలో సగం పెట్టె తెరిచిన 2 రోజుల్లోనే పాడైపోగా మిగిలినవే, మొత్తం మీద మిగిలిన 5 పండ్లతో మరో వారం నెట్టుకొచ్చాం. ఇక ఇప్పుడేం చేయాలి? ఈ నెల మొదటి వారం రోజులు చారులో చక్కెర వేసి పెట్టటం, బెల్లం చారు వంటివాటితో మేనేజ్ చేసాం. ఇంకెక్కడా మామిడి పండ్లు దొరికే ఛాన్స్ లేదనీ ఈ నాలుగు నెలలూ ఇలానే చేయాలని మా అమ్మతో చెప్పి ఇక మామిడి గుజ్జు కోసం ఇంటర్నెట్ లో గాలిస్తున్నా. ట్రై చేసి చూద్దాం అని ఏడాదిపొడవునా దొరికే మామిడి, మాన్సూన్ మంగోస్, మంగోస్ ఆల్ ఓవర్ ది ఇయర్, ఐ వాంట్ మంగోస్ నౌ, మంగోస్ ఇన్ వింటర్ వంటి కీ వర్డ్స్ టైపు చేసి చూసా. ఇక వార్తల వరద మొదలయింది. 15 రోజులు రోజుకు 3 గంటలు ఇదే పని. ముందుగా సాక్షి పత్రిక పాత జిల్లా ఎడిషన్ లో వార్త... నాంచారిమడూర్: గ్రామము మండలం: తొర్రూర్ జిల్లా:వరంగల్ మా ఇంటి ముందున్న మామిడి చెట్టు గురించి. కానీ ఆయన వివరాలేమీ లేకపోవటంతో అయ్యో అనుకున్నా. ఈలోపు పాత హిందూలో తమిళనాడులోని పీ.అల్లిముత్తు (రాశిపురం తాలూకా, మినకల్ పోస్ట్, నామక్కల్ జిల్లా, మొబైల్- 94435-11253, 94422-64273) తోటలో సీజన్లకతీతంగా విచ్చలవిడిగా కాస్తున్న మామిడి గురించి చదివి ఫోన్ చేశా. ఆ పేరు చూసాక ఆయన, ఆమె తేడా కూడా తెలీదు. అయినా ఫోన్ చేశా. ముందొక ఉషా ఊతుప్ లైన్లోకి వచ్చి నేను చెప్పేది అర్ధం కాకపోయినా తనకు తెలిసినవన్నీ చెప్పింది. చాలా సేపటి తర్వాత వాళ్ళాయనకిచ్చి పోయింది. ఆ తర్వాత అల్లిముత్తు గారు వస్తే (అయన కొద్దిగా ఇంగ్లీష్ అర్థం చేసుకొంటున్నట్లు ఉంది) విష్యం చెప్పా. అన్నీ విని చివరికి 'ఇల్లె' అంటూ పెట్టేసారు. తర్వాత ఉత్తర భారతానికి మళ్ళా. అక్బర్ చక్రవర్తి నేటి యూపీ, బీహార్ లలో పెంచిన లక్షలాది మామిడి మొక్కల సంగతి గుర్తొచ్చి మాన్సూన్ మాంగోస్ ఇన్ బీహార్ అంటూ టైపు చేయగానే గూగుల్ తల్లి బీహార్లోని ముజఫర్ పూర్ లోని జపాహా ఫార్మ్స్ ఆసామి భోలానాథ్ ఝా గారి మామిడి సాగు కథనం చూపింది. ఆరా తీస్తే పచ్చడికి తప్ప తినేవి దొరకలేదు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లా మామిడి అభివృద్ధి, పరిశోధన సంస్థ వారు శీతాకాలంలో కాసే రకాలు పెంచుతున్నారని తెలిస్తే ఫోన్ చేసాం. మమతా బెనర్జీ పాలనలో ఉన్న రాజ్యం కాబట్టి ఏదో ఒక ఉపయోగం ఉండవచ్చనిపించింది. ఫోన్ చేసి వివరాలు చెబితే వాళ్ళు ' రామ్ గోపాల్ వర్మ సినిమా చూసిగానీ ఫోన్ చేసావా? అని మర్యాదగా విసుక్కొన్నారు. మళ్ళీ చేస్తే పేపర్ లో వచ్చేవన్నీ నిజమనుకొంటే ఎలా? అంటూ చిరాకు పడ్డారు. ఎంతైనా బెంగాలీలు కదా.. ఇంకా దుర్గాపూజ మూడ్ నుంచి బయటు రాలేదేమో అనుకొన్నా. ఆ పక్కనే బంగ్లాదేశ్ లో భాగమైన 'చాపై నవాబ్ గంజ్' లోని హార్టికల్చర్ పరిశోధనా కేంద్రం సాధించిన అద్భుత మామిడి సాగు వివరాల కథనం మరోటి చూసా. వారికీ ఫోన్ చేద్దాం అనుకున్నా. కానీ జాకీర్ నాయక్ అనుచరుడనో, ప్రాణ భయంతో తలోదిక్కు పారిపోతున్న రోహింగ్యా మద్దతు దారంటారో అని భయం వేసి ఊరుకున్నా. మనవాళ్ళు ఒట్టి వెధవాయిలోయ్.. అన్న గిరీశం మాటలు గుర్తుకొచ్చి ఇక్కడ లాభం లేదు.. ఏదైనా సీమ సరుకు సీమ సరుకే అనుకొని బయట చూద్దామని సెర్చ్ మొదలెట్టా. అప్పుడే 'హోమ థెరపీ ఇంటర్నేషనల్' వారి అదిరిపోయే సైట్ చూసా. రోజూ హోమం చేసే చోట ఏడాదిపొడవునా మామిడి కాస్తుందని చెబుతున్న సైట్ అది. గొప్ప గర్వంతో సైట్ వివరాలు చూస్తే (http://www.homatherapy.org/…/mango-trees-give-fruit-all-yea…). వాళ్ళు కేవలం పరిశోధనలే చేస్తారు తప్ప పెద్దగా పంటా పాడూ పండించరని. ఇదీ రాలే బేరం కాదనుకొనగానే ది మాంగో ఫ్యాక్టరీ https://www.themangofactory.com అనే సైట్ కనిపించింది . అందులోని మనుషులూ, ఆ కాయలు చూసి'రాంగ్ టర్న్' సినిమా పాత్రలు గుర్తుకొచ్చాయి. వెన్ను జలదరించి ఆ రోజుకు ఊరుకున్నా. మరుసటి రోజు మళ్ళీ సెర్చ్ మొదలు పెట్టగానే 15 జనవరి 2016న విడుదలైన 'మాన్సూన్ మాంగోస్" ( అభి వర్గీస్ - దర్శకత్వం) వెక్కిరించింది. ఆ తర్వాతే జపాన్ దేశంలోని ఓ బుల్లి ద్వీపమైన ఇషిగాకి ద్వీపంలో సాగవుతున్న మామిడి వివరాలు చూసా. (http://www.eenadu.net/…/sunday-m…/sunday-magazineinner.aspx…). కాయలు దొరికేలా లేకపోయినా ఆర్టికల్ చదివి బాగుందనుకొన్నా. ఇంతలో.. ఆఫీసులో నా పక్క సీటు అమ్మాయి (తను డాక్టర్)కి నేను కొన్ని రోజులుగా సీరియస్ గా పనిచేయటం చూసి భయపడిందేమో? అంతా బాగుందా? అని పరామర్శించింది. ( అప్రైజల్ సమయం కదా.. తనకి డౌట్ వచ్చిండొచ్చు) మామిడి గా(బా)ధలు చెప్పుకొచ్చా. ఓ ఇంతేనా.. అంటూ ఓ నవ్వు నవ్వి తన సొంతరాష్ట్రం జార్ఖండ్ లో మామిడి జూన్ లో కాపుకొస్తుందనీ, ఎంత లేదన్నా 3 నెలలు కాయలు ఉంటాయనీ చెప్పుకొచ్చింది. కోటికాంతులతో 18 చేతులూ అభయ ముద్రలోనే ఉన్న కనక దుర్గ కనిపించినంత రిలీఫ్ దొరికింది. అనవసరంగా గూగుల్ ని ఇబ్బంది పెట్టాననుకొని ఆ తల్లికి మనసులోనే క్షమాపణ చెప్పుకొన్నా. అప్పటికప్పుడే నా ముందే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి రాంచీలో ఉన్న ఆయన మిత్రులైన పెద్ద ఎగుమతిదారులు పేర్లు చెప్పి కనుక్కొని ఏ సంగతీ చెప్పమంది. ఉంటే ఫ్లైట్ పార్సిల్ సర్వీస్ లో కోల్ కతా పంపితే మా బ్రాంచ్ ఉద్యోగి వచ్చి తీసుకొంటాడని చెబితే ..రేపే మామిడి పళ్ళు వస్తున్న ఫీలింగ్. ఆ నవ్వులో కాన్ఫిడెన్స్ చూసి ఆరోజు హాయిగా ఇంటికి పొయ్యా. మర్నాడు తీరిగ్గా 10 గంటలకి వచ్చి కాసేపు అటూ ఇటూ తిరిగి పని చేస్తున్నట్టు నటించి అసలు సంగతి చల్లగా చెప్పుకొచ్చింది. ఈ ఏడాది వానలకి ముందే పంటంతా తుడిచిపెట్టుకు పోయిందనీ, అసలు సీజన్లోనే మంచి కాయలు దొరకలేదని, మామిడి రైతులు అప్పుల పాలయ్యారని..ఇంకేదో చెప్పుకొచ్చింది. అయినా కంగారు లేదు.. అమెజాన్ ఉందిగా.. కూల్ అంది. అందులో పల్ప్ వివరాలు చూసి ఇక ఆర్డర్ చేద్దామని డౌటొచ్చి కింద ప్రోడక్ట్ రివ్యూలు చూసా. ఒక్కక్కడూ తిట్టిన బండబూతులు ఆసాంతం చదివి తెలివితక్కువ వెధవలు.. రివ్యూ చదివి కొనుక్కోకూడదూ? అనుకోని నవ్వుకున్నా. ఇలా అక్టోబర్ 10 కూడా అయిపొయింది. 11న ఉదయాన్నే ఆఫీసుకు వచ్చి లుంగీ కట్టుకొన్న ఒక పెద్దాయన సోఫాలో కూర్చొని శ్రద్ధగా.. పద్దతిగా.. గోడకట్టినట్లు కన్ను చెదిరే మామిడి పండ్లు మట్టసంగా కోస్తున్నాడు. ఫోటో చూసే నోరూరింది. ఆపై డౌటొచ్చింది. (చేదు అనుభవాల వల్ల). పాత ఫోటో, పోస్ట్ కావచ్చని డౌటొచ్చి.. గుండమ్మ కథలో సావిత్రి కాలి పుట్టుమచ్చమీద పారాణి సీనులో డిటెక్టివ్ వేషం కట్టిన ఏఎన్నార్ చూసినట్లు చూసి మొత్తం చదివా. యురేకా... అని పెద్దగా కేక వేద్దామనుకొన్నా. కార్పొరేట్ ఆఫీసు కదా.. పర్సనల్ ఎమోషన్స్ చూపకూడదని గుర్తొచ్చింది. (అసలే అప్రైజల్ సమయం). వెంటనే విష్యం చెబుతూ ఫోన్ న్యూబర్ కోసం రిక్వెస్ట్ పెట్టా. మొత్తం ఇస్తానని చెప్పా. డబ్బు తీసుకోనని ఖండితంగా చెబుతూ ఫోన్ నెంబర్ పంపించారు. అడగాలా వద్దా అనుకొంటూ ఫోన్ చేశా. గంభీరమైన గొంతు. అమ్మో అనుకొన్నా. పండ్ల ఆరా విషయంలో నా కొలీగ్ (రాంచీ అమ్మాయి) అనుభవం మట్టుకు చెప్పా. గట్టిగా మనసారా నవ్వారు. అప్పుడు ఇంకాస్త ధైర్యం చేసి మరో 2 మాటలు మాట్లాడితే సాగర్ రోడ్, హైదరాబాద్ లో ఉంటానన్నారు. వెంటనే మా తమ్ముడు ఆ పక్కనే ఉంటాడనీ, తాను రావటం సులువని చెబితే ఫోన్ నంబర్ ఇచ్చి మాట్లాడమన్నారు. మా వాడు ఆ రోజు క్లాసుల వల్ల పగలు పోలేకపోయి పొద్దుగూకినాక వెళ్లినా, ఏమాత్రం విసుక్కోకుండా ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. టార్చ్ వెలుతురులో 2 డజన్ల కాయలు కోసి ఇచ్చి పంపారు. ఇంటిమనుషుల్లా సాగనంపారు వాడిని. ఆ తర్వాత ఆ ఇంటివాతావరణం, వాళ్ళ పద్దతులు, కాయల గురించి మావాడు ఓ గంటసేపు సంతోషంగా చెప్పుకొచ్చాడు. కాయల గుజ్జు ఎలా నిల్వ చేయాలో వారి సహచరి చెప్పిన ఆదరపూర్వక సలహాలూ చెప్పి మురిసిపోయాడు. 'నీ మాట ప్రకారం పగలు వెళితే ఇంకా పండ్లు దొరికేవ'ని వాపోయాడు. భలే పండ్లు భలే పండ్లు అంటూ వీడియో కాలింగ్ చేసి మరీ చూపెట్టాడు. అలా.. ఆ రాత్రికే నాకంటే ముందు పండ్లు మా ఊరికి చేరాయి. నవనవలాడే తియ్యని పండ్లు. రుచి ఎంతో బాగుందన్నారు మా నాన్న. ఇరుగూ పొరుగూ వచ్చి చూసి ఈ ఆకాలంలో ఇంత కండగల కాయలా అంటూ చూసి దవళ్లు నొక్కుకొన్నారు. మొత్తానికి సమస్య తీరింది. ఇంకో నెలరోజులు దిగులు లేదు. ఇంతకీ మామిడిపళ్ళనిచ్చిన ఆసామి పేరు చెప్పలేదు కదా.. వారే శ్రీ వాసిరెడ్డి వేణుగోపాల్ గారు. విఖ్యాత పాత్రికేయులు. 'సార్.. నేనెవరో తెలీకపోయినా తక్షణం స్పందించి గొప్ప సాయం చేశారు. మీ, మీ సహచరి పెద్దమనసుకు, చూపిన ఆదరానికి, సౌజన్యానికి కోటి కోటి కృతఙ్ఞతలు. వీలుంటే 'మాయమై పోతున్నడమ్మా .. మనిషన్నవాడు' లాంటి పిచ్చి పాటలు రాయొద్దని గోరెటి వెంకన్నకు గట్టిగా చెప్తా అనుకోని నవ్వుకున్నా సార్. మీవల్ల నాకు గొప్ప మేలు జరగటమే గాక గొప్ప మనుషులూ దొరికారు. మీకు రుణపడి ఉన్నా. అలాగే నోముల ప్రభాకర్ గౌడ్ గారికీ. ఇప్పటికి సెలవు సార్.. నమస్తే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...