30, అక్టోబర్ 2017, సోమవారం
Fish చేపల చెరువు
రాజావారి చేపల చెరువు :P
Only for academic discussion…
నేను అభివృద్ధికి, భారీ ప్రాజెక్టులకు గుడ్డి వ్యతిరేకిని కాదు. సామాజిక, పర్యావరణ పర్యవసానాలపై సరైన అధ్యయనం వుండాలని కోరుకునే వాడిని మాత్రమే. ఆయా పార్టీలకు, ఆయా ప్రభుత్వాలకు, ఆయా నాయకులకు దీనిని ముడిపెట్టి.. రాజకీయ పోస్టుగా మార్చకండి....
హైదరాబాద్ శివార్లలో నాకు బాగా నచ్చే చెరువుల్లో ఒకటి.. నాగార్జునసాగర్ రోడ్డులోని ఇబ్రహీంపట్నం చెరువు. సింగిల్ రోడ్డు వున్నప్పుడు, ఆ కట్టమీదుగా ప్రయాణం చేస్తుంటే భయపడేవాడిని. పొరపాటున అందులో పడిపోతే మన గతేంటని భయమేసేది. అంత పెద్ద చెరువు. అది ఎండిపోవడాన్ని ఏనాడూ చూడలేదు. కానీ.. 35సంవత్సరాల తర్వాత ఎండిపోయింది. ఎన్నో కరువులు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు వచ్చినా మూడున్నర దశాబ్దాల కాలంలో ఈ చెరువు ఎండలేదు. కానీ.. ఎండిపోయింది. గూగుల్ ఎర్త్ ద్వారా సంబంధిత ఫోటోల ద్వారా ఈ విషయాన్ని వివరించడానికి, నా సందేహాలు వెలిబుచ్చడానికి ప్రయత్నిస్తాను.
2003లో చెరువు ఫుల్లుగానే వుంది. 2004నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వానలు బ్రహ్మాండంగా కురిశాయి. కానీ.. తర్వాత కాలంలో చెరువు ఎండిపోవడం మొదలైంది. 2008నాటికి నీటిచుక్క లేకుండా పోయింది. హైదరాబాద్ లో అనేక ప్రాంతాలలో చెరువులు కబ్జాకు గురయ్యాయి. నీటి పారుదల మార్గాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. అయినా ఆయా చెరువుల్లో అంతో ఇంతో నీళ్లు కనిపిస్తాయి. కానీ, ఇబ్రహీంపట్నం చెరువేవీ ఆక్రమణలకు గురవలేదు. హటాత్తుగా ఎండిపోయింది. 2014లో మాత్రమే.. కొద్దిపాటి నీళ్లు చేరాయి.
ఔటర్ రింగ్ రోడ్డు(ORR) నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత ఇబ్రహీంపట్నం చెరువు ఎండిపోవడాన్ని గమనించవచ్చు. ఒక్క ఇబ్రహీంపట్నం చెరువేకాదు, రావిర్యాల చెరువు, ఈ పరిసర ప్రాంతాల్లోని ఇంకా అనేక పెద్ద చెరువులు ఎండిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలోనే శంషాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు పొడవునా.. అన్ని ప్రాంతాల్లోనూ చెరువుల పరిస్థితి ఇలాగే అయిందా లేదా అనే విషయం నాకు తెలియదు. నేను గమనించిన విషయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాను.
ఏదో నేటి తరాల అవసరాన్ని, ఇప్పటి రద్దీని మాత్రమే దృష్టిలో వుంచుకోకుండా, భావితరాల అవసరాలను దృష్టిలో వుంచుకుని విశాలమైన రహదారులు, విమానాశ్రయాలు, ప్రయాణ సదుపాయాలు వుండడం చాలా అవసరం. నేను ఆ ప్రాజెక్టులను పూర్తిగా సమర్ధిస్తాను.
నా పాయింటు ఏమిటంటే.. ఈ ప్రాజెక్టుల కారణంగా జలవనరులు అంతరించాయా లేదా అనేదానిపై శాస్త్రీయ అధ్యయనం సాగాలని.
శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత, విమానం కనుచూపు మేరలో ఎగురుతుండగా చూడగలిగే ప్రాంతాలలో వానలు కురవడం కూడా తగ్గాయని చాలా మంది నాతో అన్నారు. ఉదాహరణకు షాద్ నగర్ ప్రాంతం. వారి అభిప్రాయంలో శాస్త్రీయత వుందని నేను అనుకోవడం లేదు. ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం తర్వాత సమీప ప్రాంతాల్లో వర్షపాతంలో వచ్చిన మార్పులతో బేరీజు వేసుకుంటే కానీ దీనిపై ఒక నిర్ణయానికి రాలేము.
కానీ.. ఇబ్రహీంపట్నం చెరువు ఎండిపోవడానికి మాత్రం ప్రధాన కారణం ఔటర్ రింగ్ రోడ్డు అయివుంటుందని నా అనుమానం. ఈ చెరువుకి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోని ఔటర్ రింగ్ రోడ్డు బొంగుళూరు జంక్షన్ చిత్రాలను, అలాగే 2004నాటి శంషాబాద్ చిత్రాలను జతపరుస్తున్నాను. ప్రతి చిత్రానికి ఆయా సంవత్సరం వివరాలు కూడా జోడిస్తున్నాను.
కేవలం అకడమిక్ డిస్కషన్ కోసం నా అనుమానాలనే కాదు.. అనేకమంది అనుమానాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఎవరినైనా ప్రోత్సహిస్తుందని ఈ పోస్టు.
28, అక్టోబర్ 2017, శనివారం
Land భూమి
భూమికి సంబంధించిన రికార్డుల్లో ని
పదాల్లో కొన్ని మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉన్నవి కాగా... ఎక్కువ మాత్రం నైజాం కాలం నాటివి.
మన రాష్ట్రం లో భూ రికార్డుల ప్రక్షాళన నేటి నుండి ప్రారంభం అయిన నేపథ్యంలో రెవెన్యూ రికార్డుల్లో ఉండే పదాలు వాటి అర్థాలు ఏమిటో తెలుసుకుందాం.
ఈ రోజు మొదటిభాగం లో కొన్ని పదాలకు అర్థం తెలుసుకుందాం...
1.అడంగల్/పహాణీ..
గ్రామంలోసాగు భూమి వివరాలను నమోదు చేసే రిజిస్టర్. దీనిని ఆంధ్రా ప్రాంతంలో అడంగల్, తెలంగాణ ప్రాంతంలో పహాణీ అని పిలుస్తారు. ఈ రిజిస్టర్‌నే గ్రామ లెక్కల నంబర్–3 రిజిస్టర్ అని కూడా అంటారు.
ఈ రిజిస్టర్‌లో గ్రామంలోని అన్ని భూముల వివరాలు ప్రతి సంవత్సరం నమోదుచేస్తారు.
2.పట్టాదారుపాసుపుస్తకాలు:
భూమి యాజమాన్యపు హక్కు పత్రాలు. గ్రామంలో ఎవరెవరికి ఎంతెంత భూమి ఉంది. ఏ సర్వే నంబర్‌లో ఉంది. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనే వివరాలతో పట్టాదారుల ఫోటోలు అతికించి 1-బి రిజిస్టర్ను తయారు చేసి దానిని బట్టి తహసీల్దారు పట్టాదారు పాసు పుస్తకాలు జారీచేస్తారు. ఈ 1-బి రిజిస్టర్ ను పూర్వం 10 (1) ఖాతాల రిజిస్టర్ అనేవారు.
3.పంచరాయి..
గ్రామంలో పశువుల మేతకోసం కేటాయించబడిన ప్రబుత్వ భూమిని పంచరాయి అంటారు. గ్రామానికి దూరంగా అందరి పశువులకు మేతకోసం ఉపయోగించుకుంటారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి దీనిపై ఎవరికీ అధికారాలు ఉండవు.
4.బందోబస్తు.. : వ్యవసాయ భూముల సర్వే, వర్గీ కరణ.
4a)బంజరు భూమి : ఖాళీగా, వ్యర్థంగా ఉన్న ప్రభుత్వ భూమి.
4b)బీఘా.. : బీఘా అంటే 30గుంటల భూమి. 36.30 చదరపు గజాలతో సమానం..
4c)బిల్ మక్తా.. : సాధారణ శిస్తుకంటే తక్కువ శిస్తు నిర్ణయించిన భూమి లేదా గ్రామాన్ని బిల్ మక్తా అంటారు.
5.చలానా..
ఇర్సాలు నామా అంటే గ్రామం లెక్క నంబర్–7. దీనినే చలానా అంటారు. దీనిద్వారా ప్రభుత్వానికి చెల్లించిన భూమి శిస్తు, వగైరాలను వసూలు చేసి నిర్ణీత తేదీల్లో ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు.
6.ఎండార్స్‌మెంట్ :
గ్రామంలో ప్రజలు....ప్రభుత్వ అధికారులకు ఏదైనా దరఖాస్తు చేసుకుంటే దానిపై నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తెలియ చేసేవిధానం.
7.ఇజారా : ప్రభుత్వానికి చెందిన భంజరు భూములను వ్యవసాయానికి కానీ, నివాసం ఉండటానికానీ కొంత నిర్థిష్టమైన పన్ను చెల్లించే పద్ధతిపై లీజుకు ఇవ్వడాన్ని ‘ఇజారా’అంటారు.
8.ఫసలీ : ప్రతి సంవత్సరం జులై,1 తరువాత నుంచి తరవాత సంవత్సరం జూన్30 వరకు ఉన్న 12నెల్ల కాలాన్ని ‘ఫసలీ’ అంటారు. ఈ పదం మొఘల్ కాలం నుంచి వాడుకలో ఉంది.
9.ఎఫ్‌ఎంబీ టిప్పన్ : ఇది గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఒకటి. గ్రా మంలోని అన్ని సర్వే నెంబర్ల పటాలు ఇందులో ఉంటాయి. వాటి కొలతలు కూడా ఉంటాయి.
10.చల్కా..
మట్టిలో ఎక్కువ భాగం ఇసుకతో కూడుకున్నది. సాధారణంగా ఈ భూముల్లో నీరు తక్కువగా అవసరం ఉండే పంటలు పండిస్తుంటారు.
10a).ఖుష్కి : వర్షాధారపు భూమిని ఖుష్కి అంటారు. దీనినే మెట్టభూమి అనికూడా అంటారు.
10b).తరి : నీటి సౌకర్యం గల భూమిని తరి అంటారు. దీనినే మాగాణి అంటారు.
25, అక్టోబర్ 2017, బుధవారం
Their history ఎరుకల వారి చరిత్ర
Their history ఎరుకల వారి చరిత్ర
ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు రాజుదే తొట్టతొలి తెలుగు (కలమళ్ళ) శాసనం. ఇది క్రీ.శ.575వ సంవత్సరం నాటిది. పూర్వ బ్రాహ్మీ లిపి (క్రీ.పూ.3వ శతాబ్దం కంటే ముందు) కాలం నుంచే తెలుగుదేశంలో కనిపిస్తున్న గుహచిత్రాల్లో (కేవ్ పెయింటింగ్స్‌లో) తెలుగు లిపి మూలాలున్నాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేస్తే తెలుగు లిపి/ భాష మూలాలతో పాటు ఎరుకల లిపి/ భాష మూలాలు కూడా వెలికి వచ్చే అవకాశం మొండుగా ఉంది.
ప్రాచీన సాహిత్యం, శాసనాలు సమకూర్చే సమాచారా న్ని ఎరుకల ప్రజలు పాటిస్తున్న ఆచార సంప్రదాయాల్లోని ప్రాచీనతతో పోల్చి సమన్వయం చూస్తే వీరిది భారతదేశంలో ఒక అనాది తెగ అని స్పష్టంగా అర్థమవుతుంది. మహా భారతం ఇతిహాసంలో కనిపించే ఏకలవ్యున్ని ఎరుకలు తమ కులాధిపతిగా చెప్పుకుంటున్నారు. కానీ హరివంశం పురా ణం (34, 93-99 అధ్యాయాలు) ప్రకారం ఏకలవ్యుడు గిరిజనుడు కాదు, క్షత్రియుడు. మధ్య భారతదేశంలోని కేకయ రాష్ర్టాన్ని పాలించే రాజుకు-అతని రెండవ భార్య శృతదేవకు పుట్టినవాడు. శృతదేవ శ్రీకృష్ణుడికి మేనత్త. కాబట్టి ఏకలవ్యుడు కృష్ణుడికి బావమరిది. కృష్ణుడి మేనమామ కంసుడి మామ జరాసంధునికి సర్వసైన్యాధిపతిగా ఏకలవ్యుడు పనిచేశాడు. కృష్ణుడు కంసున్ని చంపినందుకు ప్రతీకారంగా జరాసంధుడు కృష్ణ-బలరాములచే రక్షించబడి, మధురా పట్టణంపైన 18 సార్లు దాడి చేశాడు. ఆ దాడుల్లో భాగంగా ఏకలవ్యుడు బలరామునితో భీకరమైన ధనుర్యుద్ధాలు, గదాయుద్ధాలు చేశాడు. కానీ కృష్ణుడు చివరికి ఏకలవ్యున్ని చంపాడు.
పై చరిత్రలో ఏకలవ్యుడు క్షత్రియుడు ఏకలవ్యున్ని (తమ గిరిజన) మూల పురుషునిగా ఎందుకు భావిస్తారు అనే ప్రశ్నకు రెండు సమాధానాలున్నాయి. ఒకటి, కేకయరాజు (ఏకలవ్యుడి తండ్రి) తాత బ్రహ్మణ స్త్రీని పెండ్లి చేసుకున్నందున క్షత్రియుల్లో తక్కువ జాతి అయిన సూత జాతికి (రథకారులు) చెందినవారుగా కేకయ వంశీయులు గుర్తించబడ్డా రు. రెండు, కేకయ రాజ్యంలో గిరిజనులే ఎక్కువమంది నివసించడం, అలాంటి గిరిజనులైన భిల్లులు, ఎరుకలు ఏకలవ్యున్ని తమ మూల పురుషుడిగా చెప్పుకోనారంభించారు. ఆయన జనరంజక పాలనకు గుర్తుగా ఇక ఇప్పటివరకు లభిస్తున్న ఆధారాలు ఏకలవ్యుడు భిల్లులకే ఎక్కువ దగ్గరివాడని సూచిస్తున్నాయి. అంటే బంగారు బాణం కలవాడు అని అర్థం. అతని పెద్ద కొడుకు పేరు బాణుడు. కీచకుడు అనే మరో పేరు గల ఇతడు ఏకలవ్యుని అన్న. భిల్లులు అనే పదం విల్లులు అనే పద భవం. అంటే బాణాలు ధరించేవారనేగా! కాబట్టి ఏకలవ్యుని తండ్రి, అన్నల వారసులుగా ధనుర్విద్యా విశారధుడైన ఏకలవ్యుని వారసులుగా కూడా చెప్పవ చ్చు. రెండవ కారణమమేమంటే, భిల్లులు ఇప్పటికే ఏకలవ్యుని దేశమైన కేకయ ప్రాంతం (మధ్యప్రదేశ్)లోనే ఎక్కువగా నివసిస్తున్నారు. ఆ కాలం లో ఎరుకలు కూడా ఆ ప్రాంతంలో నివసించేవారేమో! అందుకే ఏకలవ్యున్ని తమ మూల పురుషునిగా చెప్పుకుంటున్నారేమో! ఇంకా ఆధారా లు వెతుకాలి.
ఎరుకల స్త్రీలు తాము చెప్పే సోదే (భవిష్యత్ దర్శనం)కు శక్తినిచ్చేది గా రేణుకా ఎల్లమ్మను ప్రధానంగా తలుస్తారు. రేణుకా ఎల్లమ్మ కొడుకు పరశురాముడు పడమటి సముద్రాన్నుంచి భూమిని, రాజ్యాన్ని ఏర్పరిచి సుసంపన్నం చేశాడని ప్రాచీన భారత సాహిత్యం విశదం చేస్తుంది. అతని వారసులైన భృగువులు విజ్ఞానాన్ని.. ప్రత్యేకించి అధర్వణ వేదాన్ని సంకలనం చేశారని అల్లాడి పద్మనాభయ్య రాశారు. (ఏన్సియెంట్ భృగుస్ అనే గ్రంథంలో) అధర్వణ వేదంలో కనిపించే మూలికా వైద్య విధానాలు ఎరుకలలో కన్పిస్తాయి. కాబట్టి ఎరుకల వారిని ఎల్లమ్మ-పరశురాముల వారసులా అనే విషయాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది.
ఎరుకలవారు ఎక్కువగా కృష్ణానదీ తీర ప్రాంతాల్లో కనిపిస్తారు. కృష్ణానదిని వీరు ఏరు అంటారు. ప్రాచీనకాలంలో ఏరువనాడు అనే ఒక ప్రాంతం ఉండేది. దాని పరిపాలనా కేంద్రం ఏలేశ్వరం నల్గొండ జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఏటి ఒడ్డున ఆ పట్టణం ఉంది కాబట్టి దాని మొదటిపేరు ఏఱేశ్వరం అయి ఉంటుంది, క్రమంగా ఏలేశ్వరం అయి ఉంటుందని పలువురు స్థానిక సాహిత్య-చరిత్రకారులు భావించారు. కృష్ణా నది తీరప్రాంతంలోనే నల్లమల అడవుల్లో ఉన్న సరేశ్వరం శాసనాలు, సాహి త్య గ్రంథాల ప్రస్తావనలకు భిన్నంగా జన నానుడిలో సలేశ్వరంకావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపవచ్చు.
క్రీ.శ.5వ శతాబ్దం ప్రాంతంలో ఏరువనాడులో కొంత అధికారం నెరపినవారు కనీసం మూడు దిక్కులకు వలసలు పోయి రాజ్యాలు స్థాపించినట్లు శాసనాలు, స్థల చరిత్రలు సూచిస్తున్నాయి. అలాంటివారిలో మొదటిశాఖ కర్ణాటకలోని బాదామి కేంద్రంగా క్రీ.శ. 540-750 మధ్య దక్కను రాష్ర్టాలను పాలించారు. రెండవ శాఖ కర్నూలు-కడప మండలం లో క్రీ.శ.6వ శతాబ్దంలో రేనాటి చోళులుగా స్థిరపడ్డారు. మూడవ శాఖకు చెందిన అనుమడు, కొండడు రాజ్యాన్ని స్థాపించారని తెలుస్తుంది. అలంపూరు-సంగమేశ్వరం దగ్గరి తుంబెయనూరులో లభించిన 1400ల ఏండ్ల కిందటి రెండో పులకేశి (చాళుక్య రాజు) రాగి శాసనం చాళుక్యుల జన్మస్థానం (విషయం) ఇదేనని సూచిస్తున్నది. ఈ రాజుల అధికార చిహ్నం వరాహం (పంది) అది వారి శిల్పాలు, నాణేలపై కనిపిస్తుంది. పైసలను కూడా వరహం అనేవారు. వరాహ విషయం కూడా తెలుగు దేశంలోనే ఉండేది.వరాహాలను (పందులను) పెంచడం ఎరుకల ముఖ్య వృత్తి. తొలుత చాళుక్యుల సామంతులై తదనంతరం స్వతంత్రులైన కాకతీయులు కూడా వరాహ లాంఛనులే. ఎరుకల నాంచారి గుళ్లు వారి కాలంలో పేరొందా యి. ఈ చారిత్రక విషయాలను నిగ్గుతేలిస్తే ఎరుకల పూర్వ చరిత్ర విశదమవుతుంది.
ఇప్పటివరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు రాజుదే తొట్టతొలి తెలుగు (కలమళ్ళ) శాసనం. ఇది క్రీ.శ.575వ సంవత్సరం నాటిది. పూర్వ బ్రాహ్మీ లిపి (క్రీ.పూ.3వ శతాబ్దం కంటే ముందు) కాలం నుంచే తెలుగుదేశంలో కనిపిస్తున్న గుహచిత్రాల్లో (కేవ్ పెయింటింగ్స్‌లో) తెలుగు లిపి మూలాలున్నాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేస్తే తెలుగు లిపి/ భాష మూలాలతో పాటు ఎరుకల లిపి/ భాష మూలాలు కూడా వెలికి వచ్చే అవకాశం మొండుగా ఉంది.తెలుగు అంటే తెలియు అనే అర్థం కూడా మూల ద్రావిడ భాషా పదా ల్లో కనిపిస్తుంది. కాబట్టి తెలిపేవారు అనే అర్థం కలిగిన ఎరుకలవారి భాషలో కచ్చితంగా తెలుగు భాషా మూలాలు ఉంటాయి. నిజ నిర్ధారణ కోసం చేయవలసింది అధ్యయనం.
Godavari గోదావరి
Godavari గోదావరి
గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నీటి విడుదలపై స్పష్టత
యాసంగికి సాగునీరివ్వాలని సీఎం నిర్ణయం
నీటిని పొదుపుగా వాడుకోవాలి..
వచ్చే ఏడాదికి కాళేశ్వరం నీళ్లు సిద్ధం
ఆలోగా కాల్వల నిర్మాణం పూర్తికావాలి..
ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి
వివాదాలకు తావు ఇవ్వొద్దు..
ఎల్లంపల్లి నుంచి మరో ఎత్తిపోతల..
రామగుండంలో 20వేల ఎకరాలకు నీళ్లు
ఎస్సారెస్పీ నీటి విడుదల భేటీలో
అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గోదావరి ఆయకట్టులో రెండోపంటకు నీళ్లివ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయర్ మానేరుడ్యాం, సింగూరు, ఘనపూర్ ఆనికట్, గుత్ప, అలీసాగర్, లక్ష్మీ కాల్వల ద్వారా రెండోపంటకు సాగునీరు అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ ద్వారా నీటి విడుదల, వినియోగానికి సంబంధించి పాత కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథకు కావాల్సిన నీటి అవసరాలుపోను మిగిలిన నీటిని పంటపొలాలకు మళ్లించాలని సీఎం సూచించారు. ఈ నీటితో రెండోపంట పండించుకోవాలని, ఎక్కడా వివాదాలకు తావులేకుండా ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొలాలకు తరలించుకోవాలన్నారు. నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని సీఎం సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నిరకాల చెరువులను గోదావరి నీటితో నింపుకొనే విధంగా కాల్వలు సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి కాళేశ్వరం నీళ్లు అందుబాటులోకి వస్తున్నందున ఈలోపుగానే కాల్వల పనులు పూర్తికావాలని, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నీటిపారుదల రంగానికి కావాల్సినన్ని నిధులు సమకూర్చడంతోపాటు తెలంగాణకున్న నీటి వాటా మొత్తం వాడుకొనేలా భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున.. ఎంత వీలైతే అంతవరకు పంటలకు సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని పొలాలదాకా నీరు పారించి, పంటలు పండించడంపై శ్రద్ధ చూపించాలని చెప్పారు. ఇందుకోసం అధికారుల వెంటపడి అవసరమైన పనులు చేయించుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న పాత కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందే విధంగా ఏర్పాటు జరుగాలని సీఎం స్పష్టం చేశారు.
ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల..
రామగుండం ప్రాంతంలో 20వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల పథకం నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధర్మారం మండలం పత్తిపాకలో రిజర్వాయర్ నిర్మించి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు సాగునీరు అందించాలన్నారు. ఈ రెండింటికి అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. ఎస్సారెస్పీ సామర్థ్యం పెంచాలని, అన్నిరకాల కాల్వల మరమ్మతులు చేయాలని చెప్పారు. ఎస్సారెస్పీలో తొలి, చివరి ఆయకట్టు అనే తేడాలేకుండా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేలా ప్రణాళికను అమలుచేయాలని సూచించారు. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బరాజ్ నిర్మిస్తున్నం. అక్కడ సగటున 1700టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని సీఎం అన్నారు. ఈ నీటిని వాడుకోవడానికి అవసరమైన బరాజ్‌లు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు.
గోదావరి, కృష్ణా నదీబేసిన్లలో చెరువుల ద్వారా 265 టీఎంసీల నీటి వాటా ఉన్నదని 1974లో బచావత్ ట్రిబ్యునల్ తేల్చిందని, కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు ధ్వంసం కావడం వల్ల అంత మొత్తంలో నీటిని వాడుకోలేకపోయామని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల చెరువుల్లో నీటి లభ్యత ఉంటుందని, ఇందుకుగాను అన్ని చెరువులు నింపుకొనేలా కార్యాచరణ అమలుపరుచాలని సీఎం సూచించారు.
Aadhar-bank account integration ఆధార్-బ్యాంకు ఖాతా అనుసంధానం
*ఆధార్-బ్యాంకు ఖాతా అనుసంధానం చేయకపోతే మూసేస్తారు***
బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం తప్పనిసరేనని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) శనివారం స్పష్టం చేసింది. శుక్రవారం ప్రచారమైన మీడియా కథనాలపై స్పందిస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఓ సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానమిచ్చిన ఆర్బీఐ బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యల అనుసంధానం తప్పనిసరి అని పేర్కొనే ఆదేశాలను జారీ చేయలేదని తెలిపింది. ఈ విషయాన్ని మీడియా శుక్రవారం ప్రసారం చేసింది. దీంతో ఆర్బీఐ ఈ వివరణను జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక (రికార్డుల నిర్వహణ) రెండవ సవరణ నిబంధనలు, 2017 ప్రకారం బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని తెలిపింది. అయితే బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్య అనుసంధానం చేయడం తప్పనిసరి అని పేర్కొంటూ ఇప్పటి వరకు తాను ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేదని వివరించింది. జూన్ 1 నుంచి మనీలాండరింగ్ నిరోధక (రికార్డుల నిర్వహణ) రెండవ సవరణ నిబంధనలు, 2017 అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ నిబంధనలు వర్తించే కేసుల్లో ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడం తప్పనిసరి అని తెలిపింది. ఈ నిబంధనలు చట్టపరమైనవని, బ్యాంకులు వీటిని అమలు చేసేందుకు తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూడనక్కర్లేదని పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం డిసెంబరు 31లోగా ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోవాలి. లేనిపక్షంలో బ్యాంకు ఖాతాలు లావాదేవీల నిర్వహణకు తగినవి కాదని ప్రకటిస్తారు.
Metro మెట్రోరైలు
Metro మెట్రోరైలు
మెట్రోరైలు మొదటిదశ ప్రారంభంతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
మెట్రోరైలు ప్రారంభంతో నగర ప్రయాణ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. మొదటి దశ ప్రారంభం కానున్న నాగోల్ నుంచి మియాపూర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ప్రస్తుతం రెండు నుంచి రెండున్నర గంటలు పడుతున్నది. వర్షం పడితే ట్రాఫిక్ జామ్ సమయం అదనం. అదే మెట్రోరైలులో ఈ 30 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. నవంబర్ నెలాఖరున ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రాజెక్టు మొదటిదశ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీంతో నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రోరైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో మెట్రోరైలు అధికారులు ప్రయాణపు అంచనాలు తయారుచేశారు.
ఐదు నిమిషాలకో రైలు
మెట్రో ఆపరేషన్స్‌లో ఒక్కో రైలు మధ్య వ్యవధి 3-5 నిమిషాలు ఉండనున్నది. ప్రారంభంలో మియాపూర్- అమీర్‌పేట మధ్య 7 నిమిషాలకు ఒక్కటి చొప్పున ప్రతిరోజు 8 రైళ్లు నడుస్తాయి. అమీర్‌పేట-నాగోల్ మధ్య 10 నుంచి 12 నిమిషాలకు ఒకరైలు చొప్పున 10 రైళ్లను నడిపిస్తారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా వీటిని పెంచుతారు. 30 కిలోమీటర్ల మెట్రో మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉన్నాయి. రైలు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు చేరడానికి ఒకటిన్నర నుంచి రెండు నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నది. మొదట్లో ప్రయాణ సమయం గంట వరకు ఉంటుందని, కొన్నాళ్ల తర్వాత 45 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ప్రతిరోజు 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉన్నదన్నారు.
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు అనుసంధానంగా..
నాగోల్-మియాపూర్ మార్గంలోని అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానం చేస్తూ మెట్రో ఆపరేషన్స్ చేపడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను నగరంలోని గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు, నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు అనుసంధానంగా ఉన్న జేబీఎస్, రైల్వే ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అనుసంధానిస్తూ సమీప మెట్రో స్టేషన్ల నుంచి బస్సులు నడుపనున్నారు.
నాగోల్ - మియాపూర్
దూరం: 30 కిలోమీటర్లు
స్టేషన్లు: 24
ప్రయాణ సమయం: 45-60 నిమిషాలు
సామర్థ్యం: 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది
ప్రస్తుతం రైళ్ల ఫ్రీక్వెన్సీ:
మియాపూర్- అమీర్‌పేట: 7 నిమిషాలు, అమీర్‌పేట- నాగోల్: 10- 12 నిమిషాలు
నడిపే రైళ్లు: మియాపూర్-అమీర్‌పేట మార్గంలో 8, అమీర్‌పేట- నాగోల్ మార్గంలో 10 ప్రతిరోజు ...
మరే మెట్రో సాటిరాదు..
దేశంలోని మరే మెట్రోరైలు హైదరాబాద్‌కు సాటిరాదని కేటీఆర్ చెప్పారు. దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో పీపీపీలో ఇంత పెద్ద ప్రాజెక్టును ప్రపంచంలోని ఏ దేశంలో నిర్మించలేదని అన్నారు. విదేశీ నిర్మాణ సంస్థలు కాకుండా స్వదేశీ కంపెనీ ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఒలిఫెంటా వంతెన నిర్మాణం సంక్లిష్టమైనదని, ట్రాఫిక్‌ను జీహెచ్‌ఎంసీ నియంత్రించినా రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడకుండా వంతెనను బిగించిన ఎల్‌అండ్‌టీకి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ స్టీలు బ్రిడ్జి వెరీవెరీ యునిక్ అని అభివర్ణించారు. రోడ్డు మధ్యలో హైట్ చేస్తున్నా ఇబ్బందేమీ ఉండదని, పబ్లిక్ ఫ్రీ మూమెంట్ ఉండేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రతి స్టేషన్‌లో స్టెయిర్‌కేస్‌లు, ఎస్కలేటర్లు ఉన్నాయని, స్టేషన్‌కు ఆనుకుని ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలు కూడా నిర్మిస్తామని తెలిపారు. ప్రయాణికులు మెట్రోకారిడార్లకు అనుసంధానంగా ఏర్పాటు చేసే స్కైవాక్‌ల ద్వారా తమకు అవసరమైన చోటులో దిగి పోయే విధంగా ఏర్పాట్లు ఉంటాయని అన్నారు. నాగోల్-మియాపూర్ ప్రారంభమైతే 72 కిలో మీటర్ల ఈ ప్రాజెక్టులో 40 నుంచి 42 శాతం అందుబాటులోకి వచ్చినట్లేనని తెలిపారు. ప్రస్తుతం 34 పార్కింగ్ ప్రాంతాలను గుర్తించామని, జీహెచ్‌ఎంసీ తోపాటు ప్రైవేటు పార్కింగ్‌ను కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు.
రైల్వే స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు స్కైవేలు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌నుంచి ప్రయాణికులు స్కైవేల ద్వారా నేరుగా మెట్రోరైలు స్టేషన్‌కు చేరుకోవచ్చని కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ స్టేషన్లతో స్కైవేలను అనుసంధానం చేస్తున్నామన్నారు. మెట్రోరైలు నిర్మాణం, ఆపరేషన్‌లో స్మార్ట్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. స్టేషన్ల నుంచి కాలనీలకు చేర్చేందుకు ఎలక్ట్రికల్ వాహనాలు,15 నుంచి 20 సీట్ల సామర్ధ్యం గల మినీ వ్యాన్లను ఉపయోగిస్తామని చెప్పారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని 3,4 కిలోమీటర్లలోపు ప్రయాణికుల రాకపోకలకు వీటిని ఉపయోగిస్తామన్నారు. ఎంఎంటీఎస్, ఆర్టీసీ, మెట్రోరైలు టికెట్ల కోసం కామన్ కార్డు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఓలా, ఉబెర్ సంస్థలను కూడా దీనికిందకే తెచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎల్ అండ్‌టీ స్మార్ట్‌యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.
రెండోదశపై అధ్యయనం పూర్తి
ఓల్డ్ సిటీ ప్రాజెక్టు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించి స్పష్టమైన ప్రణాళికతో దాన్ని చేపడుతామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఎంపీ దీనికి సానుకూలంగా ఉన్నారన్నారు. రెండవదశ మెట్రోరైలు నిర్మాణం కోసం టోక్యో వెళ్లివచ్చామని, వివిధ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఆర్థిక పరమైన అంశాలు, అంచనా వ్యయం, భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టతకు వచ్చామని, దీనిపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దశలవారీగా ప్రారంభిస్తూ వచ్చే సంవత్సరం నవంబర్ 2018 నాటికి పూర్తి ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామన్నారు.
Europe యూరప్
Europe యూరప్
Nomula Prabhakar Goud
యూరోపియన్ యూనియన్ జాతి రాజ్యాలపై ఆధారపడి ఉన్న కూటమి. జాతి రాజ్యాలపై ఆధారపడటమూ అంటే, విధానాల అమలు కోసం మాత్రమే కాదు. దీనివల్ల చట్టబద్ధత లభిస్తుంది. జాతి రాజ్యాల ప్రాతిపదిక మీదనే అందులోని సభ్య దేశాలు నడుస్తున్నాయి,యూరోపియన్ యూనియన్ కూడా నడుస్తున్నది. కానీ ఇటీవలి కాలంలో ఈ సభ్య దేశాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. ఈ సంక్షోభం ఒక్క స్పెయిన్‌కే పరిమితం కాలేదు. ఇతరదేశాలు కూడా అంతర్గత ఘర్షణల మూలంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
యూరప్ దేశాలలో ఈయూను వ్యతిరేకించే పార్టీలు అధికారం చేపట్టే పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఈ రాజకీయ ధోరణులు ఈయూ భవితవ్యానికి మంచిది కాదు. యూరోపియన్ యూనియన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఈ దేశాలలో లేదు. కానీ యూరోపియన్ యూనియన్ పట్ల ఎటువంటి ఎవరికీ పట్టింపు లేదు. ప్రతి దేశంలో ఎవరికి వారు అంతర్గత సంక్షోభంలో మునిగి తేలుతున్నారు. ఈ గొడవలో ఈయూ మనుగడ అనేది వారికి పట్టకుండా పోయింది. యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడం మినహా గత్యంతరం లేదనే వాదన ఆర్థిక సంక్షోభ కాలంలో వినబడింది. ఇంకా అదే వాదనతో నెట్టుకొచ్చే పరిస్థితి లేదు.
నాలుగు నెలల కిందట ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్‌కు మద్దతు దారైన ఇమాన్యూల్ మాక్రాన్ ఎన్నికయ్యారు. బ్రెగ్జిట్ మూలంగా యూరోపియన్ యూనియన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మాక్రాన్ ఎన్నిక ఊరట కలిగించింది. ఇక యూరప్ యూనియన్ నిలబడాలని కోరుకునే వారు భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుందని భావించారు. కానీ అంతలోనే స్పెయిన్ నుంచి విడిపోవాలని క్యాటలోనియా ప్రజలు ఉద్యమం ప్రారంభించారు. క్యాటలోనియా రాజధాని బార్సెలోనాలో స్వాతంత్య్ర ప్రదర్శనలు యూరోపియన్ యూనియన్ సంక్షోభం నుంచి బయట పడలేదని హెచ్చరికలను పంపించాయి. క్యాటలోనియాలోని స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వం స్వాతంత్య్రంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని స్పెయిన్ ప్రభుత్వం నిరంకుశంగా అణచివేయ ప్రయత్నించింది. ఇం దుకు ప్రతిగా నిరసనలు భగ్గుమన్నాయి. క్యాటలోనియా ప్రజలు స్వాతంత్య్రాన్ని కోరుకున్నారు.
స్పెయిన్ ఆంతరంగిక సంక్షోభం పెచ్చరిల్లే కొద్దీ యూరప్ సంక్షోభం లో కూరుకుపోవడం అనివార్యం అనిపిస్తున్నది. స్పెయిన్‌లో క్షేత్రస్థాయి లో ఏమి జరుగుతున్నదనేది గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతున్నది. యూరప్ ఆర్థికంగా బలపడుతున్నది. అయితే ఈయూ సాఫల్యతకు కూడా పరిమితి ఉన్నది. క్యాటలోనియా సంక్షోభం తలెత్తినప్పటికీ, ఫైనాన్షియల్ మార్కెట్ పెద్దగా స్పందించలేదు. దీనిని బట్టి యూరోపియన్ యూనియన్ ఆర్థికంగా ఎంత మెరుగుపడ్డదో తెలుస్తున్నది. ఇటువంటి పరిస్థితే గనుక కొన్నేండ్ల కింద తలెత్తితే స్పెయిన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయేది. కానీ ఇప్పుడు మార్కెట్లు రాజకీయ అనిశ్చితిని అధిగమిస్తున్నాయి. మొత్తం యూరోజోన్ ఆర్థిక రంగం గౌరవప్రదమైన స్థాయి లో పెరుగుతున్నది. యూరోజోన్ సగటు కన్నా కూడా స్పెయిన్ ఆర్థిక రంగం పురోభివృద్ధిలో ఉన్నది. విదేశీ పద్దులలో మిగులు చూపించుకోగలుగుతున్నది. స్పెయిన్ ఆర్థిక వ్యవస్థ దేశీయ డిమాండ్ మీద కాకుం డా, ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నది. గతంలో ఆర్థిక సంక్షోభానికి ముందు భవన నిర్మాణ రంగంలో బూమ్ ఏర్పడినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. యూరోపియన్ యూనియన్ సభ్య రాజ్యాలు లేదా బ్యాంకులు తాత్కాలిక సంకటాన్ని ఎదుర్కొన్నట్టయితే ఆదుకోవడానికి యూరోజోన్ వ్యవస్థలు ఉండనే ఉన్నాయి. అందువల్లనే స్పెయన్ రాజకీయ సంక్షోభంలో పడిపోయినా ఫైనాన్షియల్ మార్కెట్‌లో కుదుపులు సంభవించలేదు.
క్యాటలోనియా సంక్షోభం ప్రభావం ఈయూపై పడనప్పటికీ, ఒక వాస్తవాన్ని గుర్తించాలె. యూరోపియన్ యూనియన్ సమైక్యతా నమూనాలోనే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ యూనియన్ అంతిమంగా జాతి రాజ్యాల పునాదులపై ఏర్పడిందనేది గ్రహించాలె. ఇది అంతర్- ప్రభుత్వ నమూనా కాదు. పరోక్ష అమలు విధానం ప్రాతిపదికగా ఏర్పడ్డది. ఈయూ నిర్ణయాలు తీసుకుంటే వాటి అమలు బాధ్యత మాత్రం జాతీయ ప్రభుత్వాలది, అక్కడి పాలనా యంత్రాంగాలది. ద్రవ్య విధానంలో ఈ వైవిధ్యాన్ని స్పష్టంగా చూడవచ్చు. ప్రభుత్వాలు చర్చించుకొని ఉమ్మడిగా ఈ నిర్ణయాలు తీసుకోవడం లేదు. యూరోపియన్ సెం ట్రల్ బ్యాంకు పాలక మండలి మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ అమలు అనేది పరోక్ష విధానంలో ఉంటుంది. ఈ సెం ట్రల్ బ్యాంకు నిర్ణయాలను జాతీయ సెంట్రల్ బ్యాంకులు అమలు చేయాలె. ఇక్కడే చిక్కులు తలెత్తుతున్నాయి. బాండ్ల కొనుగోలు కార్యకలాపాలను సాధారణంగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు చేపడుతుం ది. కానీ సొంత ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసే జాతీయ సెంట్రల్ బ్యాంకులే ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తాయి. లగ్జెంబర్గ్‌లోని యూరోపియన్ న్యాయస్థానం ఎంతో ప్రాముఖ్యం గలది. ఈ వ్యవస్థ కూడా ప్రభుత్వాల మధ్య సమన్వయంతో నడిచేది కాదు. కేంద్రీకృతమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ దీనిలోని న్యాయమూర్తులను జాతీయ ప్రభుత్వా లు, జాతీయ న్యాయస్థానాలు నియమిస్తాయి. ఈ న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయవలసింది మాత్రం జాతీయ ప్రభుత్వాలు. అమెరికాలోని వ్యవస్థలతో పోల్చినప్పుడు, ఈయూలోని బలహీనత అర్థమవుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వుకు కూడా ప్రాంతీయ నిర్మాణ స్వరూపం ఉన్నది. కానీ డిస్ట్రిక్ట్ రిజర్వు బ్యాంకులు ఎన్నో రాష్ర్టాలకు విస్తరించి ఉంటాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వంతోనో, ఒక సంస్థతోనో అనుబంధమై ఉండవు. ఇదే విధంగా అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించవు. కేంద్రీయ వ్యవస్థ ద్వారానే నియామకాలు జరుగుతాయి. అధ్యక్షుడు నియమించిన వారిని సెనేట్ ఆమోదించవలసి ఉంటుంది.
చరిత్రలో యూరోపియన్ రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు జరిగా యి. ఈ దేశాల మధ్య పరస్పర అపనమ్మకాలు, వైషమ్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వ్యవస్థలను సభ్య దేశాలు ఉమ్మడిగా నిర్మించినప్పుడే సమైక్యత బలపడుతుంది. నిర్ణయాల అమలు కోసం మాత్రమే కాదు, న్యాయబద్ధత కోసం సభ్య దేశాల మీద ఆధారపడక తప్పదు. దీనివల్ల జాతీయ ప్రభుత్వాల మాదిరిగా, కేంద్రీయ పాలన సజావుగా సాగుతుంది. అయితే దీనికి కూడా పరిమితులు ఉన్నాయనేదే గుర్తించవలసి ఉన్నది. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు అ పరిమితులకు చేరుకున్నది. గ్రీస్‌లో పరిపాలనా, న్యాయ వ్యవస్థలు బలహీనంగా ఉం డటం వల్ల ఆర్థిక పునరుజ్జీవనం వీలు కాలేదు. పొలాండ్, హంగరీ దేశాలలో ఉదారవాద ప్రభుత్వాలు ఉండక పోవడం వల్ల న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి దెబ్బతింటున్నది. స్పెయిన్‌లో రాజకీయ వ్యవస్థ స్వయం నిర్ణయాధికారం కోరుతున్న క్యాటలోనియా ప్రాంతీయ ప్రభుత్వానికి, స్వతంత్రం గురించి కనీసం చర్చ జరుపడమే రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మధ్య వైరుధ్యాన్ని పరిష్కరించలేకపోయింది. జర్మనీ కూడా అంతర్గత రాజకీయ సవాళ్ళను ఎదుర్కొంటున్నది. ఇటీవలి ఎన్నికల్లో చాన్సలర్ ఏంజిలా మెర్కెల్ ఐదోవంతు ఓటర్లను కోల్పోయారు. ఎటూ పొసగని మూడు పార్టీల కూటమితో ఆమె నెట్టుకు రావలసి వస్తున్నది. మెర్కెల్ నాలుగవ సారి అధికారం చేపట్టగలిగారు. ఇదే ఆమె చివరి ఎన్నిక కావచ్చు. ఇటలీలో అభిప్రాయ సేకరణ ద్వారా వెల్లడైన ఫలితాలను గమనిస్తే- ఎక్కువ మందికి యూరోపియన్ పట్ల వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తున్నది.
యూరప్ దేశాలలో ఈయూను వ్యతిరేకించే పార్టీలు అధికారం చేపట్టే పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఈ రాజకీయ ధోరణులు ఈయూ భవితవ్యానికి మంచిది కాదు. యూరోపియన్ యూనియన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఈ దేశాలలో లేదు. కానీ యూరోపియన్ యూనియన్ పట్ల ఎటువంటి ఎవరికీ పట్టింపు లేదు. ప్రతి దేశంలో ఎవరికి వారు అంతర్గత సంక్షోభంలో మునిగి తేలుతున్నారు. ఈ గొడవలో ఈయూ మనుగడ అనేది వారికి పట్టకుండా పోయింది. యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడం మినహా గత్యంతరం లేదనే వాదన ఆర్థిక సంక్షోభ కాలంలో వినబడింది. ఇంకా అదే వాదనతో నెట్టుకొచ్చే పరిస్థితి లేదు. ఈయూకు మొదటి కొన్నేండ్ల పాటు కనిపించిన ఆమోదం ఇప్పుడు లేదు. ఈయూ బం ధాన్ని మరింత పటిష్ఠం చేయాలంటే, యూరప్ దేశాల నాయకులు పౌరుల ఆసక్తిని పెంచే కొత్త నమూనాను ఆవిష్కరించవలసి ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
SC ,ST రిజర్వేషన్లు
SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...
-
రుద్రమ దేవి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ పాలకులు కాకతి వెన్నయ 750-768 మొదటి గుండయ 769-824 రెండవ గుండయ 825-870 మూడవ గుండయ 870-895 ఎఱ్ఱయ 896...
-
Their history ఎరుకల వారి చరిత్ర ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు ...
-
గిద్దె, సోల, మానికలు ఇనుముతో వృత్తాకారంలో వుండే కొలత సాధనాలు. నాలుగు గిద్దెలు ఒక సోల. రెండు సోలలు ఒక తవ్వ. నాలుగు సోలలు ఒక మానిక. ఇలాంటి కొల...



