12, అక్టోబర్ 2017, గురువారం

Measurement కొలతలు

గిద్దె, సోల, మానికలు ఇనుముతో వృత్తాకారంలో వుండే కొలత సాధనాలు. నాలుగు గిద్దెలు ఒక సోల. రెండు సోలలు ఒక తవ్వ. నాలుగు సోలలు ఒక మానిక. ఇలాంటి కొలతలు గుర్తొచ్చాయి.
ఊళ్లోని కోమటి కొట్టుకి వెళ్లినప్పుడు.. మన సోల, మన మానిక తీసుకెళ్లి కొలత వేయించుకోవడం గుర్తొచ్చింది. ఈ చిత్రంలోని మానికతో పోల్చితే.. మా ప్రాంతంలో మానిక వెడల్పు తక్కువ వుండి, ఎత్తు ఎక్కువ వుంటుంది. ధాన్యాన్ని.. అనగా ఘనపదార్ధాల్ని కొలిచేటప్పుడు.. ‘తలకొట్టి’, తలకొట్టకుండా అనే పదాలు వుంటాయి. మానికలో నిండుగా ధాన్యాన్ని నింపితే.. ఎగువన పిరమిడ్ షేప్ వస్తుంది. అది తలకొట్టకుండా తూయడం. అంచువరకూ అరచేతితే సరిచేస్తే తలకొట్టి తూయడం. ఈ కొలత సాధనాల్లో ధాన్యాన్నే కాదు, ద్రవాలను కూడా కొలుస్తారు. అయితే తలకొట్టకుండా తూయడం అనేది వుండదు. తలవరకే ద్రవం నిలుస్తుంది. గిద్దెడు నెయ్యి, అరసోల నూనె.. ఇలా... తలకొట్టిన కొలతల్లో గొప్ప ఫిజిక్స్, జామెట్రీ వుంటుంది. చతురస్రం, దీర్ఘ చతురస్రాల్లో ఆ మూలనుంచి ఈ మూలకి ఒక గీత గీస్తే కర్ణం అంటారు. అదే కర్ణం వృత్తాకారాలకూ వుంటుంది. కర్ణానికి అవతల, ఇవతల సమాన స్థలం వుంటుంది. అవతల వాక్యూమ్ వుంటే, ఇవతల మ్యాటర్ వుంటుంది. తలకొట్టిన సోలలోని బియ్యం, పంచదార.. ఏదయినా కానీ.. నెమ్మదిగా వంచుతూ.. అడుగు భాగపు పై మూల, వంచుతున్న మూల.. ఒక కర్ణంగా ఏర్పడితే.. అది సరిగ్గా అరసోల కింద, అరభాగం కింద లెక్క. ఆ లెక్కలో కొలిస్తే.. ఒక్క చుక్క నెయ్యి కూడా తేడాలేకుండా కొలత తేలుతుంది. ఇవన్నీ న్యూటన్లు, పైథాగరస్ లు.. ఇలాంటి దివ్యమైన శాస్త్రవేత్తలు కనిపెట్టకముందే.. ప్రజలు కనిపెట్టుకున్నారు. మనం బళ్లలో చదువుకోవడానికి ‘థియరీ’ అనే కొరుకుడుపడని పదజాలాన్ని మాత్రమే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ... నెయ్యి ప్రస్తావన చాలాసార్లు రావడంతో.. నెయ్యితో నా అనుభవాలు కొన్ని పంచుకుంటాను. ఇది మా తాతలు తాగిన నేతుల వాసన మూతి తుడుచుకుంటూ చెప్పడంలేదు. మా నాయన నెయ్యి వ్యాపారి. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో.. కావిడి భుజానికేసుకుని ఊరూరూ తిరిగి వెన్న సేకరించి, దానిని కరిగించి డబ్బాల్లో ప్యాక్ చేసి గుంటూరు పంపేవాడు. అయితే.. ఆ రకరకాల వెన్నతో మరిగించిన నెయ్యిని మాకు వేయడానికి మా అమ్మ ఇష్టపడేది కాదు. ఇరుగుపొరుగు వాళ్ల గేదెలనుంచి వచ్చిన పాలతో చేసిన తాజా నెయ్యిని కొనేది. ఓసారి ఇలాగే అరసోల నెయ్యి తెచ్చింది. ఏదో పొలంపనిమీద బయటికెళ్లింది. నాకేమో ఆకలేసింది. బాగా బుడ్డోడిని. ఎంత బుడ్డోడిని అంటే.. అది చారో, నెయ్యో తెలియనంత బుడ్డోడిని. ఒక బొచ్చెలో అన్నం వేసుకుని, ఆ నెయ్యంతా వేసుకుని తినడం మొదలెట్టాను. అంతలోనే వచ్చిన మా అమ్మ లబోదిబో... అంత నెయ్యి పోసుకున్నందుకు లబోదిబో అని వుండదు. అంత నెయ్యిని.. చిల్లుల బొచ్చెలో పోసుకున్నందుకు, నేలంతా పారబోసినందుకు, ఒళ్లంతా పూసుకున్నందుకు లబోదిబో అన్నది.బాల్యపు జ్ఞాపకాలు ముసురుకున్నాయి. పూర్వం ఒక వ్యాపారి తన కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నాడు. తన కోడలు మంచి వ్యాపారదక్షత కలదైతే కొడుక్కి అండగా ఉంటుందనుకున్నాడు. తన వర్కరు ఒకడిని పిలిచి నువ్వులు ఇచ్చాడు. వాటికొలతకు సరిపడ నూనె కావాలి అని అన్ని గ్రామాల్లో వీధుల్లో చాటింపు వేస్తూ తిరగమన్నాడు. పనివాడు అనేక గ్రామాలు తిరిగాడు. ఎవరూ నూనె ఇవ్వటానికి ముందుకు రాలేదు. పైగా. ఏమయ్యా? నువ్వులు గానుగ ఆడితే సగం నూనె మాత్రమే వస్తుంది. లాభం వేసుకోక పోయినా నీకు నూనె ఇవ్వాలంటే సగం కొలత మాత్రమే ఎవడైనా ఇవ్వగలడు. ఎందుకు వృధా ప్రయాస - ఇంటికిపో ... అన్నారు. ఎగతాళి చేశారు. వాడు మాత్రం మా అయ్యగారు చెప్పారు. నూనె తీసుకునే పోతానని మరిన్ని గ్రామాలు తిరిగాడు. ఒక గ్రామంలో ఒక దుకాణం ముందునుంచి పోతుండగా వాడిని ఒక యువతి ఆపింది. తండ్రి పనిమీద పోతే అతడి దుకాణంలో ఆమె కూర్చుని బేరాలు చూస్తోంది. వీడు ఆమె వద్దకు వెళ్లి యజమాని చెప్పిన మాటే చెప్పాడు. ‘‘ఓస్ అంతే కదా. న్యాయంగానే అడిగావు. నేను నీకు సరికి సరి నూనె ఇస్తా ఆ నువ్వుల మూట దింపు’’ అంది. వాడు సంతోషించి మూట దింపాడు. ఆమె లోనికి వెళ్లి చాలా వెడల్పాటి పళ్లెం తీసుకు వచ్చింది. దానిలో నువ్వులను గోపురంలా నింపుకుంది. ఆ నువ్వులు తను తీసుకుని పళ్లెంలో నిండుగా పొంగేలా అప్పుడే ఆడిన నువ్వుల నూనె పోసింది. మరి కాస్త కొసరు కూడా అడగకముందే పోసింది. ‘‘ సంతోషమేనా?’’ అని అడిగింది. వాడు చాలా సంతోషమమ్మా అని ఆనందంగా వెళ్లి తన యజమానికి నూనె ఇచ్చి జరిగిందంతా చెప్పాడు. యజమాని వెంటనే మేళ తాళాలతో ఆ ఇంటికి వెళ్లి ఆ పిల్లను తనకు కోడలిగా ఇమ్మని వేడుకున్నాడు. పాత కాలం కొలతల గురించి పోస్టితే గుర్తు వచ్చిన కధ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...