30, అక్టోబర్ 2017, సోమవారం

Fish చేపల చెరువు

రాజావారి చేపల చెరువు :P Only for academic discussion…
నేను అభివృద్ధికి, భారీ ప్రాజెక్టులకు గుడ్డి వ్యతిరేకిని కాదు. సామాజిక, పర్యావరణ పర్యవసానాలపై సరైన అధ్యయనం వుండాలని కోరుకునే వాడిని మాత్రమే. ఆయా పార్టీలకు, ఆయా ప్రభుత్వాలకు, ఆయా నాయకులకు దీనిని ముడిపెట్టి.. రాజకీయ పోస్టుగా మార్చకండి.... హైదరాబాద్ శివార్లలో నాకు బాగా నచ్చే చెరువుల్లో ఒకటి.. నాగార్జునసాగర్ రోడ్డులోని ఇబ్రహీంపట్నం చెరువు. సింగిల్ రోడ్డు వున్నప్పుడు, ఆ కట్టమీదుగా ప్రయాణం చేస్తుంటే భయపడేవాడిని. పొరపాటున అందులో పడిపోతే మన గతేంటని భయమేసేది. అంత పెద్ద చెరువు. అది ఎండిపోవడాన్ని ఏనాడూ చూడలేదు. కానీ.. 35సంవత్సరాల తర్వాత ఎండిపోయింది. ఎన్నో కరువులు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు వచ్చినా మూడున్నర దశాబ్దాల కాలంలో ఈ చెరువు ఎండలేదు. కానీ.. ఎండిపోయింది. గూగుల్ ఎర్త్ ద్వారా సంబంధిత ఫోటోల ద్వారా ఈ విషయాన్ని వివరించడానికి, నా సందేహాలు వెలిబుచ్చడానికి ప్రయత్నిస్తాను. 2003లో చెరువు ఫుల్లుగానే వుంది. 2004నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వానలు బ్రహ్మాండంగా కురిశాయి. కానీ.. తర్వాత కాలంలో చెరువు ఎండిపోవడం మొదలైంది. 2008నాటికి నీటిచుక్క లేకుండా పోయింది. హైదరాబాద్ లో అనేక ప్రాంతాలలో చెరువులు కబ్జాకు గురయ్యాయి. నీటి పారుదల మార్గాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. అయినా ఆయా చెరువుల్లో అంతో ఇంతో నీళ్లు కనిపిస్తాయి. కానీ, ఇబ్రహీంపట్నం చెరువేవీ ఆక్రమణలకు గురవలేదు. హటాత్తుగా ఎండిపోయింది. 2014లో మాత్రమే.. కొద్దిపాటి నీళ్లు చేరాయి. ఔటర్ రింగ్ రోడ్డు(ORR) నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత ఇబ్రహీంపట్నం చెరువు ఎండిపోవడాన్ని గమనించవచ్చు. ఒక్క ఇబ్రహీంపట్నం చెరువేకాదు, రావిర్యాల చెరువు, ఈ పరిసర ప్రాంతాల్లోని ఇంకా అనేక పెద్ద చెరువులు ఎండిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలోనే శంషాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు పొడవునా.. అన్ని ప్రాంతాల్లోనూ చెరువుల పరిస్థితి ఇలాగే అయిందా లేదా అనే విషయం నాకు తెలియదు. నేను గమనించిన విషయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాను. ఏదో నేటి తరాల అవసరాన్ని, ఇప్పటి రద్దీని మాత్రమే దృష్టిలో వుంచుకోకుండా, భావితరాల అవసరాలను దృష్టిలో వుంచుకుని విశాలమైన రహదారులు, విమానాశ్రయాలు, ప్రయాణ సదుపాయాలు వుండడం చాలా అవసరం. నేను ఆ ప్రాజెక్టులను పూర్తిగా సమర్ధిస్తాను. నా పాయింటు ఏమిటంటే.. ఈ ప్రాజెక్టుల కారణంగా జలవనరులు అంతరించాయా లేదా అనేదానిపై శాస్త్రీయ అధ్యయనం సాగాలని. శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత, విమానం కనుచూపు మేరలో ఎగురుతుండగా చూడగలిగే ప్రాంతాలలో వానలు కురవడం కూడా తగ్గాయని చాలా మంది నాతో అన్నారు. ఉదాహరణకు షాద్ నగర్ ప్రాంతం. వారి అభిప్రాయంలో శాస్త్రీయత వుందని నేను అనుకోవడం లేదు. ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం తర్వాత సమీప ప్రాంతాల్లో వర్షపాతంలో వచ్చిన మార్పులతో బేరీజు వేసుకుంటే కానీ దీనిపై ఒక నిర్ణయానికి రాలేము. కానీ.. ఇబ్రహీంపట్నం చెరువు ఎండిపోవడానికి మాత్రం ప్రధాన కారణం ఔటర్ రింగ్ రోడ్డు అయివుంటుందని నా అనుమానం. ఈ చెరువుకి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోని ఔటర్ రింగ్ రోడ్డు బొంగుళూరు జంక్షన్ చిత్రాలను, అలాగే 2004నాటి శంషాబాద్ చిత్రాలను జతపరుస్తున్నాను. ప్రతి చిత్రానికి ఆయా సంవత్సరం వివరాలు కూడా జోడిస్తున్నాను. కేవలం అకడమిక్ డిస్కషన్ కోసం నా అనుమానాలనే కాదు.. అనేకమంది అనుమానాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఎవరినైనా ప్రోత్సహిస్తుందని ఈ పోస్టు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...